ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతున్న సమయంలో ఇద్దరు ఇరాన్ విద్యార్థులపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఇరాన్ అడ్డంగా నిలబడింది. ఇలాంటి సమయంలో ఇద్దరు విద్యార్థులపై దాడి జరగడాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణించి శనివారం నిరసన వ్యక్తం చేసింది.
రష్యాలోని కజాన్‌లోని ఓ యూనివర్శిటీలో ఇరాన్ విద్యార్థులను పోలీసులు కొట్టారనే వార్తలపై ఇరాన్ శనివారం నిరసన తెలిపింది. విద్యార్థులు తమ వీసాలను పునరుద్ధరించుకోవడానికి యూనివర్సిటీ వీసా ఎక్స్‌టెన్షన్ సెంటర్‌లో ఉన్నప్పుడు విద్యార్థులను అరెస్టు చేశారు. యూనివర్సిటీలో విద్యార్థులను పోలీసులు కొట్టారనే వార్తలపై ఇరాన్ ప్రభుత్వం శనివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
‘‘ఇరానియన్ విద్యార్థులతో దుష్ప్రవర్తనను ఖండిస్తున్నాం. బాధ్యతాయుతమైన రష్యన్ అధికారులు జవాబుదారీగా ఉండాలి’’ అని రష్యాలోని ఇరాన్ రాయబారి కజెమ్ జలాలీ ఎక్స్‌లో పోస్ట్ రాశారు. సమస్యను పరిష్కరించడంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘీ కృషి చేస్తున్నారని జలాలీ తెలిపారు.
ఇరానియన్‌లతో సహా విదేశీ విద్యార్థులు తమ వీసాలను పునరుద్ధరించుకోవడానికి కజాన్ ఫెడరల్ యూనివర్శిటీ వీసా ఎక్స్‌టెన్షన్ సెంటర్‌కు వెళ్లినప్పుడు ఈ సంఘటన శుక్రవారం జరిగినట్లు తెలుస్తోంది. విద్యార్థుల మధ్య గొడవ చెలరేగింది. దీంతో రష్యా అధికారులు ఇద్దరు ఇరానియన్లను అరెస్టు చేశారు. అయితే రష్యా పోలీసులు.. ఇరాన్ విద్యార్థులను కొట్టడాన్ని కజాన్‌లోని ఇరానియన్ కాన్సులేట్ జనరల్ తప్పుపట్టింది. ఇరాన్ కాన్సులేట్ జోక్యం చేసుకోవడంతో విద్యార్థులను శుక్రవారం రష్యన్ కస్టడీ నుంచా విడుదల చేశారు. విడుదలైన విద్యార్థులు గాయాలతో ఉన్నారని ఇరాన్ రాయబారి కజెమ్ జలాలీ చెప్పారు. వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరుపై విచారణ జరుపుతామని తెలిపారు.
ఇదిలా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఉపయోగించిన షాహెద్ డ్రోన్‌లను ఇరాన్ సరఫరా చేసినవే. ఇరాన్- రష్యా సన్నిహిత సంబంధాలను కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయం ఇలాంటి ఘటన జరగడం ఇరాన్ విస్మయానికి గురైంది.