Flordelis Dos Santos Tried 6 Times To Kill Her Husband: ఆమె మురికివాడలో పెరిగిన ఒక పేద మహిళ. అతడేమో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి. అయినప్పటికీ ఎలాంటి భేషజాలలు చూడకుండా.. ఆమెను వివాహం చేసుకున్నాడు. ఒక మంచి జీవితం ఇచ్చాడు. అంతేకాదండోయ్.. రాజకీయాల్లో చక్రం తిప్పేలా ఉన్నత స్థానాలకు ఎదిగేలా చేశాడు. అంతటి గొప్ప జీవితం ఇచ్చిన భర్తనే.. ఆరుసార్లు చంపేందుకు ప్రయత్నించింది ఆ మహిళ. చివరికి ఏడో ప్రయత్నంలో సక్సెస్ అయ్యింది. కానీ, పోలీసులకు అడ్డంగా బుక్కయ్యింది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆ మహిళ పేరు ఫ్లోర్డెలిస్ డాస్ శాంటోస్. బ్రెజిలియన్ మాజీ కాంగ్రెస్ నేత అయిన ఈమె.. మురికివాడల్లో పెరిగింది. 1994లో ఈమెకు పాస్టర్ ఆండర్సన్ డో కార్మోతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు అది ప్రేమగా మారడంతో.. ఇద్దరు వివాహం చేసుకున్నారు. బ్రెజిల్‌లోని ఎవాంజెలికల్ క్రిస్టియన్ ఉద్యమంలో ఈ జంట పాల్గొంది. రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. ఈ క్రమంలోనే.. 2018లో కన్జర్వేటివ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరుఫున శాంటోస్ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యింది. ఇలా ఆమె రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలోనే.. భర్తను చంపేందుకు స్కెచ్ వేసింది. కారణం.. ఆర్ధిక వ్యవహారాల విషయాల్లో ఆమె భర్త డో కార్మో చాలా కఠినంగా వ్యవహరించేవాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దాంతో.. భర్తను శాశ్వతంగా అడ్డు తొలగించుకుంటే, తాను ప్రశాంతంగా ఉండొచ్చని శాంటోస్ భావించింది.
ఇలా ఆమె తన భర్తను సుమారు ఆరుసార్లు విషప్రయోగం చేసి, చంపాలని ప్రయత్నించింది. కానీ, ఎలాగోలా అతడు బతికిపోయాడు. చివరికి తన బంధువు సహాయంతో ఒక ఆయుధాన్ని కొనుగోలు చేసి, 2019లో హతమార్చింది. దీన్ని సాయుధ దోపిడి హత్యగా చిత్రికరించేందుకు ప్రయత్నించింది. 2021 పార్లమెంటరీ ఎన్నికల్లో శాంటోస్ ఓడిపోయాక.. పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. ఫైనల్‌గా హంతకురాలు శాంటోస్ అని తేల్చారు. తన కుటుంబ సభ్యులు, పిల్లల సహాయంతో భర్తను చంపిందని తేలడంతో.. కోర్టుకు ఆమెకు 50 ఏళ్ల జైలు శిక్ష, సహకరించిన కూతురికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇక ఆయుధం కొన్న బంధువుకి ఏడాది క్రితమే జైలు శిక్ష విధించింది.