Teodoro Obiang Nguema Mbasogo: టియోడోరో ఒబియాంగ్ గ్వీమా మబాసోగో (80).. ఈయన గత 43 సంవత్సరాల నుంచి ఈక్వెటోరియల్ గినియా (ఆఫ్రికా దేశం) అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ప్రపంచంలోనే సుదీర్ఘ కాలం పాటు పాలించిన నేతగా చరిత్రపుటలకెక్కాడు. ఇప్పుడు మరోసారి ఆ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. నవంబర్ 20వ తేదీన అక్కడ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఇద్దరు ప్రత్యర్థులు మాత్రమే బరిలో నిలబడగా.. 14 ప్రతిపక్ష పార్టీలు ఒబియాంగ్‌కు మద్దతు తెలిపాయి. దీంతో.. ఆయనకే మళ్లీ అధికారం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది.
ఈక్వెటోరియల్ గినియా జనాభా సుమారు 15 లక్షలు. అందులో నాలుగు లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 1968లో స్పెయిన్ నుంచి స్వాతంత్రం పొందాక.. ఫ్రాన్సిస్కో మాసియస్ గ్వీమా ఆ దేశ మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈయన 1979 వరకు పాలన కొనసాగించాడు. అయితే.. గ్వీమా పాలన ఏమాత్రం సరిగ్గా లేదని, ఆయన అధికారంలో దేశం అంధకారంలో మగ్గిపోతోందంటూ ఒబియాంగ్ తిరుగుబాటు చేశాడు. ఆ దేశ జనాభా నుంచి కూడా మద్దతు దొరకడంతో.. గ్వీమా 1979లో గద్దె దిగాల్సి వచ్చింది. అప్పటి నుంచి అధికార బాధ్యతలు చేపట్టిన ఒబియాంగ్.. వరుసగా ఎన్నికల్లో విజయం సాధిస్తూ, 43 ఏళ్లుగా గినియాని పాలిస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో ఒబియాంగ్‌కు ఎన్నడూ 90 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చిన రాలేదు. ఇప్పుడు కూడా అదే రిజల్ట్ రిపీట్ అవ్వొచ్చని సమాచారం.
ఇంతకాలం అధ్యక్షుడిగా ఉన్నాడు కదా.. బహుశా ఒబియాంగ్‌పై ఎలాంటి మచ్చ ఉండకపోవచ్చని అనుకుంటే, పప్పులో కాలేసినట్టే! గినియాలో చమురు, సహజవాయు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఏ స్థాయిలో ఉందంటే.. ఆ దేశాన్ని పేదరికం నుంచి విముక్తి కల్పించవచ్చు. కానీ, ఒబియాంగ్ అలా చేయడంలో విఫలమయ్యారని విమర్శలున్నాయి. అంతేకాదు.. దేశంలో అవినీతి వ్యవస్థను ప్రోత్సహించారనే ఆరోపణలూ ఉన్నాయి. తనకు పోటీగా నిలబడే వాళ్లను బెదిరించడం లేదా మరణశిక్షలు వంటివి అమలు అమలు చేస్తారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారం కోసం ఒబియాంగ్ చాలా దారుణంగా వ్యవహరిస్తాడని మానవ హక్కుల సంఘాలు ఎల్లప్పుడూ మండిపడుతూనే ఉంటాయి.