Earthquake: బుధవారం అండమాన్ & నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చింది. బుధవారం తెల్లవారుజామున 5:40 గంటల సమయంలో భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 5.0గా నమోదైంది. అయితే.. ఇది 10 కిలోమీటర్ల లోతులో సంభవించడంతో, ఎలాంటి నష్టం జరగలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గడిచిన 5 రోజుల్లోనే ఈ ప్రాంతంలో భూకంపం సంభవించడం ఇది రెండోసారి. గత శనివారం (జులై 29న) అర్ధరాత్రి 12.53 గంటలకు ఈ దీవుల్లో బలమైన భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదవ్వగా.. ఈ భూకంపం 69 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు ఎన్‌సీఎస్ వెల్లడించింది.
ఐదు రోజుల్లోపే రెండుసార్లు భూకంపం సంభవించిన నేపథ్యంలో.. అండమాన్ దీవుల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాబోయే ప్రళయానికి ఇవి సంకేతాలు ఇస్తున్నాయేమో? అని కంగారు పడుతున్నారు. 2004 నాటి విధ్వంసం రిపీట్ కాకపోతే చాలని కోరుకుంటున్నారు. అటు, అధికారులు కూడా ఏదైనా ప్రమాదం సంభవిస్తే, తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నారని సమాచారం.
