Site icon NTV Telugu

Police Caught Thief With Mosquito Help: దొంగను పట్టించిన దోమ.. ఎలాగో తెలుసా?

Mosquito Caught Robbery

Mosquito Caught Robbery

Dead Mosquito Helps Police To Catch A Thief In China: అతడు ఒక ఘరానా దొంగ. దొంగతనం చేయడంలో బాగా ఆరితేరాడు. ఎప్పట్లాగే ఒక రోజు ఆ దొంగ ఒక ఇంట్లో దొంగతనం చేశాడు. ఒక్క సాక్ష్యం కూడా వదలకుండా, చాకచక్యంగా ఆ ఇంటిని దోచేశాడు. 19 రోజుల పాటు పోలీసులకు చిక్కుండా, వారిని ముప్పుతిప్పలు పెట్టాడు. ఇక తాను దొరకనని, దర్జాగా తిరగడం మొదలుపెట్టాడు. ఇంతలోనే.. ఒక దోమ అతని పాలిట శాపంగా మారింది. అతనిని అడ్డంగా పట్టించింది. దీంతో, అతడు కటకటకాల వెనక్కు వెళ్లాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

అది చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్. ఎప్పట్నుంచో ఒక ఖరీదైన అపార్ట్‌మెంట్‌పై కన్నేసిన దొంగ.. ఆ ఇంట్లో ఉన్న వాళ్లు ఊరికి వెళ్లిన విషయం తెలుసుకొని, ఒక రోజు రాత్రి ఇంట్లోకి చొరబడ్డాడు. విలువైన వస్తువులన్నీ సర్దుకోవడమే కాదు, వంటగదిలోకి వెళ్లి విందు భోజనం కూడా ఆరగించాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కట్ చేస్తే.. రెండ్రోజుల తర్వాత ఆ ఇంటి యజమానులు తిరిగొచ్చారు. ఇంట్లోకి అడుగుపెట్టగానే చోరీ జరిగిందని గ్రహించిన వాళ్లు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఇల్లు మొత్తం శోధించారు. దొంగకు సంబంధించిన ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదు కానీ, బూడిదైన మస్కిటో కాయిల్ వారికి కనిపించింది. అది చూసి.. దొంగ రాత్రంతా ఇంట్లోనే ఉన్నాడన్న సంగతి పోలీసులు గుర్తించారు.

అప్పుడు మళ్లీ మరింత శోధించగా, వారికి గోడ మీద చనిపోయిన దోమ ఒకటి కనిపించింది. పోలీసులు క్లూస్ టీమ్‌ని రంగంలోకి దింపి, జాగ్రత్తగా బ్లడ్ శాంపిల్‌ని తీసుకున్నారు. ఫోరెన్సిల్ ల్యాబ్‌కు పంపించారు. ఆ రిపోర్ట్ వచ్చేదాకా దొంగ కోసం పోలీసులు వెతికారు కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. 19 రోజుల తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్ రాగానే.. తమ వద్దనున్న క్రిమినల్ రికార్డ్ ఓపెన్ చేసి, వాటితో పోల్చారు. అందులో నుంచి ఒక వ్యక్తితో డీఎన్ఏ మ్యాచ్ అవ్వడంతో.. అతడ్ని మర్యాదగా పిలిపిచారు. ఆరోజు దొంగతనం చేసింది నువ్వే కదా? అని అడిగితే.. కాదని ఓవర్ చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పోలీసులు.. రిపోర్ట్ ముందు పెట్టిన తమదైన శైలిలో ప్రశ్నిస్తే.. అప్పుడు నిజం కక్కాడు. అలా చనిపోయిన దోమ, దొంగని పట్టించింది.

Exit mobile version