‘కాల్ ఆఫ్ డ్యూటీ’ వీడియో గేమ్ సృష్టికర్త, అపర మేధావి విన్స్ జాంపెల్లా (55) కన్నుమూశారు. ఫెరారీ స్పోర్ట్స్ కారు ప్రమాదంలో మంటలు చెలరేగి జాంపెల్లా తుది శ్వాస విడిచారు. ‘టైటాన్‌ఫాల్’, ‘అపెక్స్ లెజెండ్స్’, ‘స్టార్ వార్స్ జెడి’ గేమ్‌లతో జాంపెల్లా ఎంతో ప్రసిద్ధి చెందారు. ఆయన అకాల మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సోమవారం లాస్ ఏంజిల్స్‌కు ఉత్తరాన ఉన్న రహదారిపై పెరారీ కారును జాంపెల్లా అత్యంత వేగంగా నడిపారు. ఈ క్రమంలో అదుపు తప్పి సిమెంట్ దిమ్మను ఢీకొట్టింది. వెంటనే కారులోంచి మంటలు చెలరేగి జాంపెల్లా ప్రాణాలు కోల్పోయారు. కాంక్రీట్ దిమ్మను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లుగా కాలిఫోర్నియా హైవే పెట్రోల్ ఒక ప్రకటనలో తెలిపింది. వాహనం నుంచి దూకేసిన డ్రైవర్, ప్రయాణికుడు ఇద్దరూ గాయాలతో ప్రాణాలు వదిలినట్లుగా తెలిపింది. ప్రమాదాన్ని ప్రత్యక్ష సాక్షులు మొబైల్‌లో షూట్ చేశారు. అయితే ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
జాంపెల్లా..
జాంపెల్లా వీడియో గేమ్స్ నిర్మాణాల్లో దిగ్గజం. అమెరికన్ వీడియో గేమ్ డిజైనర్. ఇన్ఫినిటీ వార్డు సహా వ్యవస్థాపకుడు. స్టూడియో అధిపతిగా.. రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, రిప్పల్ ఎఫెక్ట్ స్టూడియోస్ అధిపతిగా ప్రసిద్ధి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఇతడు సృష్టించిన గేమ్‌లు అమ్ముడయ్యాయి. జాంపెల్లా తొలుత మిలిటరీ షూటర్ స్టైల్‌లో గేమ్‌ను రూపొందించారు. ఇక ‘‘కాల్ ఆఫ్ డ్యూటీ’’ గేమ్‌తో చాలా ఫేమస్ అయ్యారు. ‘‘కాల్ ఆఫ్ డ్యూటీ’’ గేమ్ నెలకు 100 మిలియన్లకు పైగా యాక్టివ్ ప్లేయర్‌లను కలిగి ఉంది.
1990లో షూటర్ గేమ్‌లపై డిజైనర్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు. తర్వాత 2002లో ఇన్ఫినిటీ వార్డ్‌ను సహ-స్థాపించాడు. 2003లో ‘‘కాల్ ఆఫ్ డ్యూటీ’’ని రూపొందించాడు. అనంతరం యాక్టివిజన్ అతని స్టూడియోను సొంతం చేసుకుంది. వివాదాస్పద పరిస్థితుల్లో యాక్టివిజన్‌ను విడిచిపెట్టి 2010లో రెస్పాన్‌ను స్థాపించాడు. దీన్ని ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ 2017లో సొంతం చేసుకుంది.
