Site icon NTV Telugu

Joe Biden: అత్యంత రహస్యంగా బైడెన్ ఉక్రెయిన్ పర్యటన.. ఎయిర్ ఫోర్స్ వన్ లేకుండా.. రైలులో ప్రయాణం..

Joe Biden

Joe Biden

Biden’s top secret visit to Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది కాలం గడుస్తోంది. ఇప్పటికీ రెండు దేశాల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ లో చలి కాలం ముగింపుకు రావడంతో రానున్న కాలంలో రష్యా మరింతగా దాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యంత రహస్యంగా ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనపై ఇటు అధికారులకు కానీ అటు మీడియాకు కానీ ముందస్తు సమాచారం లేకుండా అత్యంత రహస్యం పర్యటన సాగింది.

ఎయిర్ ఫోర్స్ వన్ లేకుండా ప్రయాణం..

అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోనే ప్రయాణిస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా సీ-32 విమానంలో బయలుదేరారు. గత కొన్నాళ్లుగా ఉక్రెయిన్ పర్యటకు వెళ్లాలని జోబైడెన్ భావిస్తున్నారు. అయితే ఉక్రెయిన్ గగనతలం ప్రస్తుతం సురక్షితంగా లేకపోవడంతో అధికారులు ఈ పర్యటనను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే శుక్రవారం ఉక్రెయిన్ పర్యటనకు బైడెన్ పచ్చ జెండా ఊపారు. దీంతో ప్రయాణ షెడ్యూల్ అత్యంత రహస్యంగా తయారైంది. కేవలం కొద్ది వైట్ హౌజ్ అధికారులకు మాత్రమే ఈ పర్యటన గురించి తెలుసు. శనివారం రాత్రి 7 గంటలకు భార్ జిల్ బైడెన్ తో డేట్ కు వెళ్లిన జో బైడెన్ ఆ తరువాత 36 గంటల పాటు బాహ్య ప్రపంచానికి కనిపించలేదు.

శనివారం రాత్రి 7.00 గంటలకు జోబైడెన్ పోలాండ్ బయల్దేరుతారని షెడ్యూల్ లో ఉంది. అంతకుముందే బైడెన్ జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి 4 గంటలకే బయలుదేరారు. ముందుగా బైడెన్ విమానం జర్మనీ రామ్ స్టెయిన్ లోని అమెరికా సైనిక స్థావరానికి చేరుకుని అక్కడ నుంచి పోలాండ్ లో ల్యాండ్ అయింది. పోలాండ్ లోని జెసియోనాక్ నగరంలో నుంచి రైలులో 10 గంటలు ప్రయాణించి సోమవారం ఉదయం 8 గంటలకు ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు చేరుకున్నారు. ఆ తరవాత రాత్రి 8 గంటలకు పోలాండ్ చేరుకున్నారు.

కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. రష్యాకు ముందే సమాచారం..

ఈ పర్యటన గురించి రష్యాకు ముందే సమాచారం ఇచ్చారు అమెరికా అధికారులు. బైడెన్ అక్కడున్న సమయంలో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. అయితే దీనిపై రష్య స్పందన వెల్లడించేందుకు అమెరికా జాతీయభద్రత సలహాదారు జాక్ సులేమాన్ నిరాకరించారు. ఈ పర్యటనలో కొద్ది మంది అధికారులు, మెడికల్ టీం, అసోసియేటెడ్ ప్రెస్‌కి చెందిన ఫోటోగ్రాఫర్ ఇవాన్ వుక్సీ, వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెందిన రిపోర్టర్ సబ్రినా సిద్దిఖీలు మాత్రమే బైడెన్ వెంట వెళ్లారు. బైడెన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఉన్న సమయంలో అమెరికా ఈ-3 సెంట్రీ ఎయిర్ బార్న్ రాడార్ విమానం, ఎలక్ట్రానిక్ ఆర్సీ-135 రివిట్ జాయింట్ ఎయిర్ క్రాఫ్ట్ నిఘా విమానాలు కీవ్ గగనతలంపై నిఘా ఉంచాయి.

గతంలో కూడా పలువురు యూఎస్ అధ్యక్షులు యుద్ధ క్షేత్రాల్లో పర్యటించారు. 2006లో జార్జ్ బుష్ ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో పర్యటించారు. 2014లో బరాక్ ఒబామా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో పర్యటించారు. 2019లో డొనాల్డ్ ట్రంప్ ఆప్ఘనిస్తాన్ లోని బాగ్రామ్ ఎయిర్ ఫీల్డ్ లో ప్రత్యక్షమయ్యారు.

Exit mobile version