Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు

  • గాజా యుద్ధం సమయంలో ఏం జరిగింది!
  • నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా?
  • వెలుగులోకి ఆసక్తికర విషయాలు
Joebidennetanyahu

Joebidennetanyahu

గాజా యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య జరిగిన కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి కొందరిని చంపి.. మరికొందరిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. అనంతరం హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. గాజాపై భీకర దాడులు చేసింది.

అయితే గాజా యుద్ధం విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని మాజీ కీలక సలహాదారు బ్రెట్ మెక్‌గర్క్ వెల్లడించారు. కొద్ది కాలానికే పరిస్థితి మరింత ముదిరి.. ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సాయాన్ని నిలిపివేసే స్థాయికి బైడెన్ ఆలోచనలు వెళ్లాయని ఆయన రాసిన పుస్తకం ‘Brink’లో పేర్కొన్నారు.

మెక్‌గర్క్… బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా వ్యవహారాలకు సమన్వయకర్తగా పనిచేశారు. గాజాలో పౌరుల మరణాలు, మానవతా సాయం అందకుండా ఆంక్షలు, హమాస్ దగ్గర ఉన్న బందీల విడుదల కోసం జరుగుతున్న చర్చల విషయంలో బైడెన్–నెతన్యాహు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని పుస్తకంలో వివరించారు.

2024 ప్రారంభంలో బైడెన్-నెతన్యాహు మధ్య సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. 2023 చివరి మూడు నెలల్లో ఇద్దరు నేతలు 20 సార్లు ఫోన్‌లో మాట్లాడుకోగా.. 2024 తొలి మూడు నెలల్లో ఆ సంఖ్య కేవలం రెండుకు పడిపోయింది. ఇక ఏప్రిల్ 1న గాజాలో వరల్డ్ సెంట్రల్ కిచెన్‌కు చెందిన సహాయక సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాలపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన బైడెన్ కుటుంబాన్నీ తీవ్రంగా కలచివేసిందని మెక్‌గర్క్ పేర్కొన్నారు. నెతన్యాహుపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ జిల్ బైడెన్ ఓ నోట్ ఇచ్చినట్లు ఆమె సొంత జ్ఞాపకాలలోనూ వెల్లడించారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత బైడెన్.. నెతన్యాహుతో మాట్లాడాల్సి వచ్చింది. ఆ సమయంలో బైడెన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని మెక్‌గర్క్ గుర్తుచేశారు. ఇజ్రాయెల్‌పై అమెరికా సైనిక సాయాన్ని నిలిపివేస్తామని నెతన్యాహుకు హెచ్చరించాలని కొందరు సలహాదారులు సూచించినట్లు తెలిపారు. అయితే మరికొందరు అధికారులు దీనివల్ల హమాస్ దగ్గర ఉన్న బందీల విడుదలకు సంబంధించిన చర్చలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్.. బందీల ఒప్పందం కుదరడం ద్వారా కాల్పుల విరమణకు మార్గం ఏర్పడుతుందని, చర్చలు కొనసాగుతున్నంతకాలం ఇజ్రాయెల్‌కు మద్దతు అవసరమని వాదించినట్లు మెక్‌గర్క్ తెలిపారు.

నెతన్యాహుతో మాట్లాడిన సమయంలో బైడెన్ ఆగ్రహం స్పష్టంగా కనిపించిందని మెక్‌గర్క్ వెల్లడించారు. నెతన్యాహు ఏం చేస్తున్నారని బైడెన్ ప్రశ్నించారని.. “నేను శాంటా క్లాజ్ అనుకుంటున్నావా?” అని తీవ్ర స్వరంతో అడిగారని ఆయన పేర్కొన్నారు. అమెరికా సైనిక సాయాన్ని నిలిపివేయగల సామర్థ్యం తనకు ఉందని కూడా బైడెన్.. నెతన్యాహుకు స్పష్టం చేసినట్లు మెక్‌గర్క్ తెలిపారు. వరల్డ్ సెంట్రల్ కిచెన్ సిబ్బంది మృతిని నెతన్యాహు అనుకోకుండా జరిగిన పొరపాటుగా వివరించేందుకు ప్రయత్నించగా.. బైడెన్ ఆయన మాటలను మధ్యలోనే ఆపేశారని చెప్పారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత బైడెన్–నెతన్యాహు సంబంధాలు పూర్తిగా తెగిపోయేంత దగ్గరగా వచ్చిన సందర్భం ఇదేనని మెక్‌గర్క్ తన పుస్తకంలో పేర్కొన్నారు.

అయితే ఈ వివాదం మరింత ముదరకముందే మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ స్థాయిలో డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసేందుకు సిద్ధమైంది. అయితే ఆ సమయంలో నెతన్యాహుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నప్పటికీ.. ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు అమెరికా సహకరించాల్సిందేనని బైడెన్ నిర్ణయించుకున్నారని మెక్‌గర్క్ గుర్తుచేశారు. అమెరికా బలగాలు ఇజ్రాయెల్, కొన్ని అరబ్ దేశాల భాగస్వామ్యంతో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో దాదాపు అన్నింటినీ అడ్డుకున్నాయని పేర్కొన్నారు. ఆ తర్వాత నెతన్యాహు ఇరాన్‌పై భారీ ప్రతిదాడికి దిగకుండా అడ్డుకోవడంపై బైడెన్ దృష్టి పెట్టారు. “నేను ఇప్పుడే నెతన్యాహును కాపాడాను.. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపాలి” అని బైడెన్ తన సలహాదారులతో అన్నట్లు మెక్‌గర్క్ తెలిపారు. ఇక అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ మరింత దౌత్యపరమైన రీతిలో “Take the win” అని సూచించారు. బైడెన్ అదే సందేశాన్ని నెతన్యాహుతో మాట్లాడేటప్పుడు ఉపయోగించారు. ఇరాన్‌కు గట్టి గుణపాఠం చెప్పాలని నెతన్యాహు తొలుత వాదించినప్పటికీ.. చివరకు భారీ స్థాయి ప్రతిదాడికి దూరంగా ఉన్నారని మెక్‌గర్క్ వెల్లడించారు.