Site icon NTV Telugu

Aaron Carter: పాప్ సింగర్ ఆరోన్ అనుమానాస్పద మృతి.. బాత్‌టబ్‌లో మృతదేహం

Aaron Carter Dies

Aaron Carter Dies

American Pop Singer Aaron Carter Dies At 34: అలనాటి నటి శ్రీదేవి ఎలా మృతి చెందిందో గుర్తుందా? బాత్ టబ్‌లో పడి, ఊపిరాడక ఆమె ప్రాణాలు విడిచింది. సరిగ్గా అలాగే.. ప్రముఖ పాప్ సింగర్ ఆరోన్ కార్టర్ (34) తన ఇంట్లోని బాత్ టబ్‌లో పడి మరణించాడు. శనివారం ఉదయం 10:58 గంటలకు అతని మృతదేహం లభ్యమైనట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే.. మొదట్లో ఆ మృతదేహం ఎవరిదో గుర్తించడం కష్టమైందని, ఆ తర్వాత ఆరోన్ కార్టర్‌గా గుర్తించామని తెలిపారు. తాము కార్టర్ మేనేజర్‌ని సంప్రదిస్తే.. అతడు వెంటనే స్పందించలేదని వెల్లడైంది. కార్టర్ మృతికి గల కారణాలేంటో స్పష్టంగా తెలియరాలేదు కాబట్టి.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాగిన మైకంలో టబ్‌లో పడి మృతి చెందాడా? లేక బలవన్మరణానికి పాల్పడ్డాడా? లేదా ఏదైనా కుట్ర దాగి ఉందా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. మరో విషయం.. ఇతను ‘బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్’ నిక్ కార్టర్ సోదరుడు.

ఆరోన్ కార్టర్ 1987 డిసెంబర్ 7వ తేదీన ఫ్లోరిడాలోని తాంపాలో జన్మించాడు. తన 7వ ఏటనే పాటలు పాడటం మొదలుపెట్టిన ఆరోన్.. 1997లో తన 9వ ఏట మొదటి ఆల్బమ్‌ని రిలీజ్ చేశాడు. అతని ఆరోన్ పార్టీ (కమ్ గెట్ ఇట్) ఆల్బమ్ మూడు మిలియన్ కాపీలు అమ్ముడుపోయాయి. ఇక అప్పట్నుంచి అతడు చాలా పాపులర్ అయిపోయాడు. ఇతర పాప్ సింగర్స్‌తోనూ కలిసి పని చేసిన ఇతడు, కొన్ని షోలలో కూడా పాల్గొన్నాడు. అయితే.. రానురాను అతడు ఫేడ్ ఔట్ అవుతూ వచ్చాడు. వ్యక్తిగతంగా జీవితంలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కున్నాడు. ఆస్తి విషయమై కుటుంబ సభ్యులతోనూ గొడవ పడ్డాడు. 2013లో ట్యాక్స్‌కి సంబంధించి మిలియన్ల డాలర్లు బాకీ ఉన్నాడంటూ ఇతనిపై పిటిషన్ కూడా దాఖలైంది. డ్రగ్స్ కూడా తీసుకునేవాడని ఆరోపణలు ఉన్నాయి. రెండు ఆరోగ్య కేంద్రాల్లో ఇతడు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. తన కెరీర్‌ని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నించాడు కానీ, ఫలితంగా లేకుండా పోయింది. ఇప్పుడు 34 ఏళ్ల వయసులో అతడు విగతజీవిగా మారాడు.

Exit mobile version