Site icon NTV Telugu

Nuclear Deal: అణు యుద్ధం వస్తుంది..!? అగ్రదేశాల డీల్‌ ముగియడంతో భయం గుప్పిట్లో ప్రపంచం!

Nuclear Deal Russia America

Nuclear Deal Russia America

ప్రపంచం ఒక ప్రమాదకరమైన దశలోకి అడుగుపెట్టింది. మూడు దశాబ్దాలుగా అణు యుద్ధాన్ని వెనక్కి నెట్టిన ఒక ఒప్పందం.. ఈ రోజుతో ముగిసిపోయింది. అమెరికా-రష్యా మధ్య ఉన్న చివరి అణు కట్టడి తాళాలు తెగిపోయాయి.

ప్రపంచంలో ఉన్న అణ్వాయుధాల్లో 87 శాతం ఒకే రెండు దేశాల చేతుల్లోనే ఉన్నాయి. ఈ రోజు నుంచి ఆ రెండు దేశాల చేతులకు ఎలాంటి చట్టబద్ధమైన అడ్డుకట్ట లేదు. ఇది యుద్ధం మొదలైన రోజు కాదు కానీ.. యుద్ధాన్ని ఆపే చివరి గోడ కూలిన రోజు. చరిత్రలో ఒకే ఒకసారి ఇదే జరిగినప్పుడు కోల్డ్ వార్ వచ్చింది. అయితే ఈసారి నేరుగా అణు యుగం మొదలవుతుందా అనే ప్రశ్న ప్రపంచాన్ని వెంటాడుతోంది. ఇంతకీ ఈ ఒప్పందం ఏంటి? మనం ఇప్పుడు ఏ దిశలో నడుస్తున్నాం?

ఈ ఒప్పందం ఒక్కరోజులో పుట్టినది కాదు. దీని వెనుక దశాబ్దాల భయం ఉంది. 1945 తర్వాత ప్రపంచం అణు ఆయుధాల నీడలోనే జీవించింది. అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ మొదలైనప్పుడు, యుద్ధం జరగకపోయినా యుద్ధం భయం మాత్రం ప్రతి క్షణం వెంటాడేది.

ఇద్దరూ రోజుకో బాంబు తయారు చేసుకుంటూ పోతే చివరకు భూమి మిగలదన్న నిజం అప్పుడే అర్థమైంది. అదే అణు నియంత్రణ ఆలోచనకు జన్మనిచ్చింది. 1991లో సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత పరిస్థితి మరింత సున్నితంగా మారింది. పాత శత్రుత్వం తగ్గినా, చేతుల్లో వేల అణు వార్‌హెడ్లు మిగిలిపోయాయి. అప్పుడు అమెరికా, రష్యా కలిసి మొదటిసారి స్టార్ట్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అణు ఆయుధాలను తగ్గించాలి, ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోవాలన్నది ఆ ఒప్పందాల లక్ష్యం. అదే బాటలో 2010లో న్యూ స్టార్ట్ ఒప్పందం వచ్చింది. ఇది కేవలం సంఖ్యల ఒప్పందం కాదు. అణు యుద్ధాన్ని లెక్కలతో నియంత్రించే ప్రయత్నం.

న్యూ స్టార్ట్ కింద అమెరికా, రష్యాలు తమ అణు వార్‌హెడ్లను 1550కే పరిమితం చేయాలి. ఎక్కడ ఎన్ని మిసైళ్లు ఉన్నాయో చెప్పాలి. ఎప్పుడైనా తనిఖీలకు అనుమతించాలి. ఇది నమ్మకానికి చట్టబద్ధమైన రూపం.

ఈ ఒప్పందం వల్లే గత 16ఏళ్లుగా అణు యుద్ధం కేవలం హెచ్చరికలకే పరిమితమైంది. కానీ ఈ వ్యవస్థ ట్రంప్ పాలనలో క్రమంగా కూలడం మొదలైంది. ట్రంప్ అంతర్జాతీయ ఒప్పందాలను అమెరికా చేతులను కట్టేసే సంకేళ్లగా చూశాడు. అంతేకాదు, అమెరికా మళ్లీ అణు ఆయుధాల పరీక్షలు చేయాల్సిందే అన్న సంకేతాలు కూడా ఇచ్చాడు. ఇది ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఇటు రష్యా వైపు చూస్తే పరిస్థితి అంతకన్నా తీవ్రంగా కనిపిస్తోంది. యుక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా అణు హెచ్చరికలను బహిరంగంగానే చేసింది. ఇకపై తాము అణు పరిమితులకు కట్టుబడి ఉండబోమని అధికారికంగా ప్రకటించింది. పుతిన్ ఒకవైపు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని చెబుతూనే, మరోవైపు కొత్త తరహా అణు ఆయుధాలను పరీక్షించారు. అణు శక్తిని మాటల్లో కాదు, ఆయుధాల రూపంలో చూపించే ప్రయత్నం మొదలైంది. ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం కూలిపోవడం అందుకే ప్రపంచాన్ని కూడా భయపెడుతోంది. ఎందుకంటే ప్రపంచంలోని అణు ఆయుధాల్లో 87 శాతం ఈ రెండు దేశాల చేతుల్లోనే ఉన్నాయి. వీళ్లిద్దరికీ పరిమితులు లేకపోతే, మిగతా దేశాలకు నియమాలు ఎందుకన్న ప్రశ్న తలెత్తుతుంది. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం బలహీనపడుతుంది. కొత్త దేశాలు అణు ఆయుధాల వైపు అడుగులు వేస్తాయి.

ఇప్పటికే ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. రష్యా పోసైడాన్ అనే అణు టార్పెడోను పరీక్షించింది. అమెరికా అంతరిక్షం నుంచే మిసైళ్లను అడ్డుకునే గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది. చైనా తన అణు సామర్థ్యాన్ని వేగంగా పెంచుతోంది. ఇవన్నీ కలిసి ఒక కొత్త అణు పోటీకి రూపం ఇస్తున్నాయి.

ఐక్యరాజ్యసమితి కూడా ఇదే విషయాన్ని బహిరంగంగా చెప్పింది. గత అర్ధ శతాబ్దంలో ఎన్నడూ లేనంత ప్రమాదకరమైన దశలో ప్రపంచం నిలిచిందని హెచ్చరించింది. యుద్ధం మొదలవ్వడానికి బాంబుల సంఖ్య కంటే, వాటిని ఉపయోగించాలనే నిర్ణయం తీసుకునే మనుషుల మనస్తత్వమే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

భవిష్యత్తులో కొత్త ఒప్పందం రావచ్చు. కొత్త చర్చలు మొదలవ్వచ్చు. కానీ ఈరోజు మాత్రం ప్రపంచం ఒక ప్రమాదకర దశలోకి అడుగుపెట్టింది. అణు ఆయుధాలకు లెక్కలు లేవు. పరిమితులు లేవు. నియంత్రణ లేదు. ఇది యుద్ధం మొదలైన రోజు కాదు.కానీ యుద్ధాన్ని ఆపే చివరి తాళం తెగిపోయిన రోజు మాత్రం ఇదే.

ALSO READ: మరణానికి 85 సెకన్ల దూరంలో భూమి.. డూమ్స్‌ డే క్లాక్‌ చెబుతున్న భయంకర నిజాలు!

Exit mobile version