Acid Served In Water Bottles In Pakistan Restaurant: రెస్టారెంట్ సిబ్బంది నిర్వాకం కారణంగా ఓ ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. వాటర్ బాటిల్‌లో యాసిడ్ సర్వ్ చేయడం కారణంగా.. చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఈ ఘటన పాకిస్తాన్‌లోని వెలుగు చూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఒక కుటుంబం పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కోసం, పాకిస్తాన్‌లోని ప్రముఖ ఇక్బాల్ పార్క్‌లో పోయిట్ రెస్టారెంట్‌కి వెళ్లింది. మొదట్లో వేడుకలు సజావుగా సాగాయి. కానీ, ఇంతలో రెస్టారెంట్ సిబ్బంది వాటిర్ బాటిళ్లలో యాసిడ్ సర్వ్ చేశారు. ఆ బాటిల్‌ని ఉపయోగించి ఇద్దరి చిన్నారుల్లో ఒకరు చేతులు కడుక్కోగా, మరోకరు తాగారు. అంతే.. కొద్దిసేపు తర్వాత ఒకరు ‘మంట’ అంటూ ఏడవడం మొదలుపెడితే, మరొకరు వాంతులు చేసుకొని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై బాధితుల కుటుంబ సభ్యుడు మహ్మద్ ఆదిల్ మాట్లాడుతూ.. రెస్టారెంట్ సిబ్బంది అందించిన వాటర్ బాటిల్‌లో యాసిడ్ ఉండటం వల్ల తన మేనకోడలు వాజిహ, మేనల్లుడు అహ్మద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెప్పాడు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. మేనకోడలు వాజిహ పరిస్థితి చాలా విషమంగా ఉందని పేర్కొన్నాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, రెస్టారెంట్ మేనేజర్ మహమ్మద్ జావెద్‌తో పాటు ఐదుగురు సిబ్బందిని అరెస్ట్ చేశారు. అలాగే దర్యాప్తు పూర్తయ్యేదాకా.. రెస్టారెంట్‌ని మూసేశారు. ఈ ఘటనపై పోలీస్ అధికారి తాహిర్ వాకస్ మాట్లాడుతూ.. ఇది చాలా విచిత్రమైన సంఘటన అని, తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అంటే.. ఇది రెస్టారెంట్ సిబ్బంది నిర్వాకమా? లేక ఎవరైనా కుట్ర పన్ని ఈ పని చేయించారా? అనే కోణాల్లో విచారిస్తున్నారు.
