A Robber Rescued From Tunnel In Rome After Alleged Attempted Bank Heist: అదొక దొంగల ముఠా.. దొంగతనం చేయడమే ఆ ముఠా పని! అయితే.. ఈసారి కొంచెం భారీ మొత్తమే దోచుకోవాలనుకొని, ఒక బ్యాంక్‌కి కన్నం వేయాలని ప్లాన్ చేశారు. సినిమాలని చూసి స్ఫూర్తి పొందిన ఆ దొంగలు.. సొరంగం మార్గం ద్వారా దోపిడీ చేయాలని స్కెచ్ గీసుకున్నారు. దాదాపు వీరి ప్లాన్ వర్కౌట్ అయ్యింది కూడా! కానీ, చివరి నిమిషంలో మొత్తం బెడిసికొట్టడంతో అడ్డంగా దొరికిపోయారు. ఈ నెల 11వ తేదీన ఇటలీలోని రోమ్‌లో.. వాటికన్ సిటీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
వాళ్లు మొత్తం ఐదుగురు దొంగలు. చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే ఈ ముఠా.. ఏకంగా బ్యాంక్ దోచేయాలని ప్రణాళిక రచించారు. అందుకు వాటికన్ సిటీకి సమీపంలో ఉన్న ఓ బ్యాంక్‌ను ఎంపిక చేసుకున్నారు. నేరుగా రంగంలోకి దిగితే చాలా రిస్క్.. అందుకే సొరంగ మార్గం ద్వారా దొంగతనం చేయాలని ప్లాన్ వేశారు. ఆగస్టు 15వ తేదీన ఫెర్రగాస్టో సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉంటుంది కాబట్టి.. సరిగ్గా ఆ రోజు బ్యాంక్‌కి కన్నం వేసేలా సొరంగం తవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఖాళీగా ఉన్న ఒక షాపుని రెంట్‌కి తీసుకున్నారు. అన్ని అనుకున్నట్టుగా సెట్ అవ్వడంతో.. ఆ షాపు నుంచి సొరంగం తవ్వడం మొదలుపెట్టారు. ఆరు మీటర్ల లోతులో కొంత దూరం వరకు సొరంగం తవ్వేశారు.
అయితే.. మధ్యలో ఆ సొరంగం కుప్పకూలింది. దీంతో ఆ ఐదుగురు దొంగలో అందులో చిక్కుకుపోయారు. నలుగురు వ్యక్తులు ఎలాగోలా దాన్నుంచి బయటపడ్డారు కానీ, ఒక దొంగ మాత్రం ఎనిమిది గంటలపాటు అక్కడే ఉండిపోయాడు. అతడ్ని కాపాడేందుకు అగ్నిమాపక, విపత్తు సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది. గంటల తరబడి కష్టపడిన తర్వాత, ఎట్టకేలకు అతడ్ని కాపాడగలిగారు. కాపాడుతున్న సమయంలో ‘కాపాడండి, దయచేసి నన్ను రక్షించండి’ అంటూ గట్టిగా రోదించాడని చెప్తున్నారు. ఇంతకీ.. ఇతని గురించి పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారో తెలుసా? ఆ నలుగురు దొంగలే!
