Site icon NTV Telugu

Measles Outbreak: జింబాబ్వేలో మీజిల్స్ వ్యాధి తాండవం.. 700 మంది చిన్నారులు మృతి

Measles Outbreakzimbabwe

Measles Outbreakzimbabwe

700 Children Died In Zimbabwe Due To Measles Outbreak: జింబాబ్వేలో మీజిల్స్ వ్యాధి విలయ తాండవం చేస్తోంది. అక్కడి జనాల్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి బారినపడిన వారిలో 700 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం సెప్టెంబర్ 1న ఒక్క రోజే 37 మంది చిన్నారులు మృతి చెందడం.. తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తొలుత ఈ మీజిల్స్ తొలి కేసు ఈ ఏడాది ఏప్రిల్ తొలివారంలో మనికాల్యాండ్ ప్రావిన్స్‌లో నమోదైంది. ఆ తర్వాత కొన్ని వారాల వ్యవధిలోనే దేశమంతా వ్యాపించింది. ఇప్పటివరకూ 6291 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి వల్ల మరణాల రేటు ప్రారంభ దశలో కన్నా, ఇప్పుడు నాలుగు రెట్లకు పెరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది. దీన్ని బట్టి ఈ వ్యాధి తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

పోషకాహార లోపంతో పాటు మీజిల్స్ టీకా తీసుకోకపోవడం వల్లే పిల్లలు మృత్యువాత పడుతున్నట్టు తేలింది. మరణించిన చిన్నారుల్లో చాలామంది టీకాలు తీసుకోలేదని మంత్రి మోనైకా ముత్స్‌వాంగా తెలిపారు. జింబాబ్వేలో మతపరమైన నమ్మకాలు చాలా ఎక్కువ. ఆ నమ్మకాలతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయించలేదు. ఇప్పుడదే వారి పాలిట శాపంగా మారిందని, పిల్లలు చనిపోతున్నారని అధికారులు చెప్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని.. పిల్లలకు తప్పకుండా టీకా వేయించేలా ఒక కొత్త చట్టం తీసుకురావాలని జింబాబ్వే భావిస్తోంది. 6 నెలల నుంచి 15ఏళ్ల పిల్లలకు పెద్దఎత్తున మాస్ వ్యాక్సినేషన్‌తో పాటు అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఇందుకు మతపెద్దలు కూడా సహకరించాలని, మత నమ్మకాల్లో మునిగిపోయి ఈ కార్యక్రమాలకు అడ్డు చెప్పొద్దని, దాని వల్ల మీ పిల్లలకే నష్టం వాటిల్లుతుందని అక్కడి ప్రభుత్వం చెప్తోంది.

కాగా.. ప్రమాదకరమైన అంటు వ్యాధుల్లో మీజిల్స్ ఒకటి. దగ్గు, తుమ్ము, గాలి త్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధిక సోకిన వారిలో దగ్గు, జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాక్సిన్ తీసుకోని, అలాగే పోషకాహార లోపంతో బాధపడే పిల్లలు.. వెంటనే ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించాలంటే.. 90 శాతం మంది చిన్నారులకు వ్యాక్సిన్లు అందించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version