Shani Margi 2026: శని దేవుడి అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్న 3 రాశుల వారికి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయా? ఇప్పటివరకు ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, పనుల్లో ఆటంకాలతో సతమతమైన వారికి ఇక ఊరట లభించనుందా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడి కదలికల్లో మార్పు వస్తే 12 రాశుల వారి జీవితాలపైనా దాని ప్రభావం ఉంటుందని నమ్ముతారు. ముఖ్యంగా శని వక్రగతిలో ఉన్నప్పుడు పనుల్లో ఆలస్యం, ఆర్థిక ఇబ్బందులు, అనుకోని సమస్యలు ఎదురవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. అయితే శని తిరిగి మార్గంలోకి వస్తే పరిస్థితులు క్రమంగా మారతాయని, చాలాకాలంగా ఆగిపోయిన పనులు కూడా ముందుకు సాగుతాయని భావిస్తారు. ఈ క్రమంలోనే 2026 డిసెంబర్ 11న శని దేవుడు మీన రాశిలో మార్గంలోకి రాబోతున్నారు. ఈ మార్పు ముఖ్యంగా వృషభం, మకరం, తుల రాశుల వారికి మంచి ఫలితాలను తీసుకురావచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఈ మూడు రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు.
పంచాంగం, జ్యోతిష్య గణనల ప్రకారం 2026 డిసెంబర్ 11వ తేదీ తెల్లవారుజామున 5:01 గంటలకు శని దేవుడు మీన రాశిలో మార్గి (Shani Margi 2026) కానున్నారు. అంటే అప్పటివరకు కొనసాగిన వక్రగతి ముగిసి తిరిగి సాధారణ దిశలో ప్రయాణించడం ప్రారంభిస్తారు. అంతకుముందు జూలై 27, 2026 నుంచి శని వక్రగతిలో ఉన్నారు. దాదాపు నాలుగున్నర నెలల పాటు వక్రగతిలో కొనసాగిన తర్వాత మళ్లీ మార్గిలోకి వస్తున్నారు. ఈ మార్గి స్థితి సుమారు 241 రోజుల పాటు కొనసాగుతుందని జ్యోతిష్య గణనలు సూచిస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని కర్మఫల ప్రదాతగా పరిగణిస్తారు. మనిషి చేసే పనులకు అనుగుణంగా ఫలితాలను అందిస్తారని నమ్ముతారు. క్రమశిక్షణ, సహనం, కష్టపడే తత్వం, బాధ్యత, న్యాయం వంటి అంశాలకు శని కారకుడిగా చెబుతారు. శని వక్రగతిలో ఉన్న సమయంలో గతంలో మొదలుపెట్టిన పనుల్లో ఆలస్యం, బాధ్యతల ఒత్తిడి, కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుందని జ్యోతిష్య విశ్వాసం. అదే శని మార్గిలోకి వచ్చినప్పుడు పెండింగ్ పనులు పూర్తవడం, చాలాకాలంగా పడుతున్న కష్టానికి తగిన ఫలితం దక్కడం వంటి సానుకూల పరిణామాలు చోటుచేసుకోవచ్చని భావిస్తారు.
ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ శని మార్గి ప్రయాణం అనుకూలంగా ఉండొచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. చాలాకాలంగా ప్రయత్నిస్తున్న పనులు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. గతంలో ఎదురైన అడ్డంకులు క్రమంగా తొలగిపోవడంతో పాటు అదృష్టం కూడా కలిసి రావచ్చని అంటున్నారు. ఉద్యోగాలు చేసేవారికి పని ప్రదేశంలో ఎదురవుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభించవచ్చు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు రావడంతో పాటు తమ ప్రతిభను నిరూపించుకునే ఛాన్స్ దక్కవచ్చు. ఆర్థిక విషయాలకు వస్తే ఆదాయం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఖర్చులను అదుపులో పెట్టుకుని డబ్బును పొదుపు చేసుకోవడంలో కూడా విజయవంతం కావచ్చు. మొత్తంగా వృషభ రాశి వారికి నిలిచిపోయిన పనులు పూర్తవుతూ ముందుకు వెళ్లే సమయం కావచ్చని చెబుతున్నారు.
మకర రాశి వారికి కూడా శని మార్గి కావడం ఆర్థికంగా మంచి మార్పులు తీసుకురావచ్చని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా చాలాకాలంగా చేతికి అందకుండా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గతంలో ఆర్థికంగా ఎదురైన ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చు. వ్యాపారాలు నిర్వహించే వారికి కొత్త లాభదాయక అవకాశాలు కనిపించవచ్చు. మధ్యలో ఆగిపోయిన పాత వ్యాపార ప్రణాళికలను మళ్లీ ప్రారంభించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. దీంతో పాటు డబ్బుకు సంబంధించిన సమస్యలు తగ్గి ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడవచ్చని జ్యోతిష్య విశ్వాసం.
ఇక తుల రాశి వారికి శని మార్గి కావడం ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతికి దోహదపడవచ్చని చెబుతున్నారు. ఇప్పటివరకు చేసిన కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. చాలాకాలంగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు శుభవార్త అందవచ్చని అంచనా. ఆఫీసులో పైఅధికారులు, తోటి ఉద్యోగుల నుంచి సహకారం లభించవచ్చు. కొత్త బాధ్యతలు చేపట్టడం లేదా ఉద్యోగంలో కీలకమైన మార్పులు చోటుచేసుకోవడం వంటి అవకాశాలు రావచ్చు. వ్యాపారులకు కూడా పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారవచ్చు. పాత పరిచయాలు, వ్యాపార సంబంధాల ద్వారా కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఆదాయం పెరగడంతో పాటు కెరీర్లో ముందడుగు వేసే సమయం కావచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

