Toxic Work Culture: వాష్‌రూమ్‌కి వెళ్లిన టైమ్ కూడా కౌంట్ చేశాడు..మేనేజర్‌ మైండ్‌సెట్‌పై ఉద్యోగి ఆవేదన

Toxic Manager

Toxic Manager

ఒక్కసారి ఆలోచించండి.. మీరు ఉద్యోగానికి వెళ్లారు.. మీ పని మీరు చేసుకుంటున్నారు.. కానీ అక్కడ మీ పనికంటే మీరు వేసే ప్రతి అడుగునూ గమనించే ఒక మేనేజర్ ఉంటే ఎలా ఉంటుంది? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, టీమ్‌ గ్రూప్‌లో ఏం రాశారు, ఎంత సేపు వాష్ రూమ్‌కు వెళ్లారు? ఎన్ని నిమిషాలు బ్రేక్ తీసుకున్నారు లాంటి ప్రతీ విషయాన్ని మీ మేనేజర్‌ గమనిస్తుంటే మీకేం అనిపిస్తుంది?

ఇది స్కూలా? జైలా? ఆఫీసా? అని అనిపిస్తుంది కదా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఉద్యోగి అనుభవం కథ కూడా ఇదే చెబుతోంది. రెడ్డిట్‌లోని ఓ పోస్ట్ ఇప్పుడు ఇండియాలో పెరుగుతున్న టాక్సిక్ వర్క్ కల్చర్‌పై మరోసారి పెద్ద చర్చకు దారి తీసింది.

సీక్రెట్‌గా చాటింగ్‌లు చదివాడు:

రెడ్డిట్‌లో తన బాధను పంచుకున్న ఓ ఉద్యోగి తన కంపెనీలో పనిచేయడం అంటే ప్రతి రోజూ మానసిక ఒత్తిడితో బతకడమేనని చెప్పాడు. ఒక రోజు మేనేజర్ మీటింగ్‌కు పిలిచి అతన్ని అందరి ముందు అవమానించాడట. కారణం ఏంటంటే అతను మైక్రోసాఫ్ట్ టీమ్స్ చాట్‌లో తన స్నేహితుడితో చేసిన వ్యక్తిగత సంభాషణ. ఆ చాట్‌ను మేనేజర్ రహస్యంగా చదివాడని ఉద్యోగి ఆరోపించాడు.

ఆఫీస్‌లో పని చేయడానికి వస్తున్నావా లేదా సరదా చేయడానికి వస్తున్నావా అని నిలదీశాడట. తన వ్యక్తిగత చాట్‌ను ఎందుకు చదివారని ప్రశ్నించగానే మేనేజర్ మరింత ఆగ్రహానికి గురయ్యాడని అతను చెప్పాడు. అంతటితో ఆగలేదు. ఆ చాట్ స్క్రీన్ షాట్లను కంపెనీ యజమానికి పంపించి నీ భవిష్యత్తు ఇప్పుడు ఆయన చేతిలోనే ఉందని హెచ్చరించాడట. అసలు ఆ ఉద్యోగి చాట్‌లో ఏముందంటే ఆఫీస్‌లో పరిశుభ్రత లేకపోవడం వల్ల తనకు చెవి, ముక్కు, గొంతు సమస్య వచ్చిందని, చికిత్స కోసం 5వేల రూపాయలు ఖర్చు అయ్యిందని, ఆఫీస్ పరిస్థితులపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడట. అంటే కంపెనీ లోపాలను చెప్పినందుకే ఉద్యోగమే పోయే పరిస్థితి వచ్చిందని అతను ఆరోపిస్తున్నాడు. ఇంకా షాకింగ్ విషయం కూడా ఉంది.

కంపెనీకి దండంపెట్టిన HR:

ఆ కంపెనీలో హెచ్‌ఆర్ కూడా ఉద్యోగానికి రాజీనామా చేసిందట. ఉద్యోగులను తొలగించడం కోసం గూఢచర్యం చేయాలని యాజమాన్యం ఒత్తిడి తీసుకురావడంతో తాను అలా చేయలేనని చెప్పి బయటకు వెళ్లిపోయిందని ఉద్యోగి అంటున్నాడు. అంతేకాదు కంపెనీ యజమాని AI సహాయంతో ఒక ప్రత్యేక హెచ్‌ఆర్ సాఫ్ట్‌వేర్‌ తయారు చేసి ఉద్యోగులు ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఎంతసేపు వాష్ రూమ్‌కు వెళ్లారు అనే వివరాలను కూడా ట్రాక్ చేస్తున్నారని ఆరోపించాడు.

వర్క్ క్వాలిటీ కంటే మనిషి కదలికలను కొలవడం ఏ సంస్థకు అయినా ప్రమాదకర సంకేతమేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ ఉద్యోగికి నెలకు 28వేల రూపాయల జీతం. పనితీరును బట్టి కొన్నిసార్లు ప్రోత్సాహకం వస్తుంది, కొన్నిసార్లు అసలు రాదట. బీమా లేదు. ఇతర ఉద్యోగ ప్రయోజనాలు లేవు. ఒక్క నిమిషం ఆలస్యంగా లాగిన్ అయినా శాలరీ కట్ చేస్తారట. తనకు థైరాయిడ్ సమస్య ఉందని, ఇంట్లో భార్య ఆరోగ్యం బాగోలేక వంట కూడా తానే చేసుకోవాల్సి వస్తుందని, అందుకే ప్రతిరోజూ 10నిమిషాలు ఆలస్యం అవుతోందని అతను వివరించాడు.

నిద్రను కూడా త్యాగం చేస్తే చివరకు నడిచే శవంలా మారిపోతానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో వేలాది మంది స్పందించారు. ఇలాంటి కంపెనీని వెంటనే వదిలేయాలని కొందరు సూచించగా, మరికొందరు ఇలాంటి టాక్సిక్ మేనేజర్లు ఉద్యోగులను మనుషులుగా కాకుండా యంత్రాల్లా చూస్తున్నారని మండిపడ్డారు.