మహిళకు తన శరీరం మీద నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ వచ్చిన ప్రతి కాలంలోనూ.. ఆ స్వేచ్ఛకు కాపలా కాయడానికి ఒక కొత్త అధికారం పుట్టుకొచ్చింది. కొన్నిసార్లు మతం పేరుతో, ఇంకొన్నిసార్లు సంస్కృతి పేరుతో.. మరికొన్నిసార్లు కుటుంబ గౌరవం పేరుతో ఆ అధికారులు స్త్రీ స్వేచ్ఛను అణచివేశాయి. ఇప్పుడు AI టెక్నాలజీ కాలంలోనూ అదే అధికారం కొత్త బట్టలు వేసుకుని తిరుగుతోంది. ఇటలీలో జరిగిన తాజా వివాదం దానికి ప్రత్యక్ష ఉదాహరణ.
ఇటలీ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ తన కొడుకుకు పెళ్లి సలహా ఇస్తూ తక్కువ ఆడంబరంగా కనిపించే, మరింత నమ్మకమైన మహిళను ఎంచుకోవాలని చెప్పారు. ఆమె మంచి తల్లి అవుతుందని, వివాహ బంధానికి కట్టుబడి ఉంటుందన్నారు.
ఆ నమ్మకానికి ఆయన చూపించిన కొలమానం కూడా చెప్పారు. కొంచెం పొడవైన స్కర్ట్ ఉండాలట. ఈ మాటలు అన్నది ఇటలీ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి. మహిళ విశ్వసనీయతను ఆమె శరీరంపై కనిపించే వస్త్రంతో కలిపే ఆలోచనకు అధికార స్వరం దొరికిన సందర్భం ఇది. అందుకే ఇటలీలోనే ప్రతిఘటన మొదలైంది. మాజీ టురిన్ మేయర్, ఎంపీ చియారా అప్పెండినో మినీ స్కర్ట్‌లో తన ఫొటో పెట్టి తజానీని నిలదీశారు. తనను చూసి తాను నమ్మదగిన మహిళనా, మంచి తల్లినా అని ప్రశ్నించారు? ఇక ఇటలీ సెనేట్‌లో పలువురు మహిళా ఎంపీలు, సెనేటర్లు మినీ స్కర్ట్‌లతో నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్తే చరిత్రలో ఒక పొడవైన రక్తపు గీత కనిపిస్తుంది. ఇది కేవలం ఇటలీకి సంబంధించిన విషయం కూడా కాదు. ఏ దేశం చూసినా ఏముంది గర్వకారణం.. స్త్రీ అణచివేత తప్ప అన్నట్టు ఇటలీ నుంచి ఇరాన్, ఇండియా వరకు ఇదే తరహా ఆలోచనా తీరు కనిపిస్తుంటుంది.
1979లో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడిన కొద్ది రోజులకే మహిళల హిజాబ్‌పై ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయి. మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున వేలాది ఇరానియన్ మహిళలు టెహ్రాన్ వీధుల్లోకి వచ్చారు. వారి మధ్య మత విశ్వాసం ఉన్నవారూ ఉన్నారు, లౌకిక మహిళలూ ఉన్నారు. వారి మధ్య ఒకే ప్రశ్న నిలిచింది.. తలపై ఏం ఉండాలో నిర్ణయించే అధికారం మహిళకు చెందుతుందా, అధికారానికి చెందుతుందా? తర్వాత ఆ నియంత్రణ చట్టంగా బలపడింది.
దుస్తులు క్రమంగా రాజకీయ విధేయతకు గుర్తుగా మారాయి. మహిళ శరీరం మీద ప్రభుత్వానికి ఉన్న అధికారం, ఆమె వివాహం, విడాకులు, ఉద్యోగం, వారసత్వం, ప్రజా జీవితంపై ఉన్న ఇతర పరిమితులతో కలిసి ఒక పెద్ద నియంత్రణ వ్యవస్థగా మారింది. నాలుగు దశాబ్దాలు గడిచాయి. 2022లో అమినీ అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణతో నిర్బంధనకు గురైంది. ఆమె పోలీసు కస్టడీలో మరణించింది. ఆమె అంత్యక్రియల దగ్గర నుంచి మొదలైన ఆగ్రహం దేశమంతా వ్యాపించింది. మహిళలు తలపై ఉన్న హిజాబ్‌లను తొలగించారు. జుట్టు కత్తిరించారు. వీధుల్లో నిలబడి ఒక నినాదాన్ని ప్రపంచానికి వినిపించారు. అదే.. జిన్, జియాన్, ఆజాదీ. అంటే మహిళ.. జీవితం.. స్వేచ్ఛ అని అర్థం. ఈ నినాదం మూలాలు కుర్దిష్ మహిళా ఉద్యమంలో ఉన్నాయి. తర్వాత ఇరాన్ ఉద్యమానికి అది ప్రాణ వాక్యంగా మారింది.
ఒక చోట ప్రభుత్వం మహిళ తలపై వస్త్రం ఎంత ఉండాలో నిర్ణయించింది. మరో చోట ఒక మంత్రి మహిళ స్కర్ట్ ఎంత పొడవుగా ఉండాలో ఆధారంగా ఆమె కుటుంబ విలువను చదవడానికి ప్రయత్నించారు. రూపం వేరు. అధికార భావన ఒకటే. మహిళ శరీరం మీద తుది మాట చెప్పే హక్కు తమకే ఉందనే భావన. ఇండియాలో ఈ నియంత్రణకు మరో రూపం కనిపించింది.
2009లో మంగళూరులోని ఒక పబ్‌లో యువతులపై శ్రీరామ్ సేన కార్యకర్తలు దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆ తర్వాత వాలెంటైన్స్ డే సందర్భంగా జంటలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరికలు వచ్చాయి. దానికి సమాధానంగా నిషా సుసన్ తదితరులు పింక్ చడ్డీ క్యాంపెయిన్ ప్రారంభించారు. వేలాది మంది ఆ నిరసనలో చేరారు. ఇక 2011లో టొరంటోలో ఓ పోలీసు అధికారి చేసిన ఒక్క వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. లైంగిక హింస నుంచి రక్షించుకోవాలంటే మహిళలు తమ దుస్తులు, రూపం విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నది ఆ వ్యాఖ్య సారాంశం. దాని నుంచి స్లట్వాక్ ఉద్యమం పుట్టింది. అదే ఉద్యమం భారత్‌లోకి వచ్చేసరికి బెషర్మీ మోర్చాగా మారింది.
ఎందుకంటే ఇక్కడ కూడా అదే ప్రశ్న. మహిళపై హింస జరిగినప్పుడు సమాజం మొదట ఆమెను విచారిస్తుంది. ఆమె ఎక్కడ ఉంది? ఎవరితో ఉంది? ఏం వేసుకుంది? ఆ రాత్రి బయట ఎందుకుంది? హింస చేసిన మనిషి గురించి తక్కువగా చర్చ జరుగుతుంది. బాధితురాలి శరీరం మాత్రం విచారణ బల్ల మీద కూర్చుంటుంది. నిజానికి మహిళపై నియంత్రణను ప్రేమగా మభ్యపెడతారు.. అనుమానాన్ని నైతికతగా అభివర్ణిస్తారు.. ఆంక్షను సంస్కృతిగా పిలుస్తారు. ఆమెకు గోడ కట్టి, ఆ గోడను కుటుంబ రక్షణగా వివరిస్తారు.
ఇలా మహిళ ధరించిన బట్టలను చూసి ఆమె స్వభావాన్ని చదివే ఈ అలవాటు యుగాల పాతది. కానీ ప్రతి తరంలో మహిళలు దానికి కొత్త సమాధానం రాశారు. ఇరాన్ వీధుల్లో జుట్టు కత్తిరించిన మహిళ.. మంగళూరుకు ప్రతిస్పందనగా పింక్ చడ్డీ పంపిన మహిళ.. ఢిల్లీలో బెషర్మీ మోర్చాలో నడిచిన మహిళ… టొరంటోలో స్లట్వాక్లో నిలిచిన మహిళ. ఇటలీ సెనేట్‌లో మినీ స్కర్ట్ వేసుకుని నిలిచిన మహిళ.. వీళ్లందరి మధ్య కాలం వేరు. దేశం వేరు. రాజకీయ పరిస్థితులు వేరు. కానీ పోరాటం ఒకటే.
నా శరీరాన్ని నా తరఫున మీరు చదవకండి.. నా జీవితానికి నా బదులు అర్థం చెప్పకండి.. నా వ్యక్తిత్వానికి నా ఒంటిమీద కనిపించే వస్త్రాన్ని సాక్ష్యంగా నిలబెట్టకండి. 21వ శతాబ్దాంలో కూడా ఒక మహిళ మంచి భార్య అవుతుందా, మంచి తల్లి అవుతుందా, నమ్మదగినదా అని ఆమె స్కర్ట్ పొడవుతో కొలిచే స్థితి ఉందంటే.. ఈ సమాజం ఏం మారినట్టో ఏమో..! నిజానికి సాంకేతికత మారింది.. భాష కూడా మారింది.. కానీ మహిళను కొలిచే పురుషాధిక్య కొలమానం మాత్రం ఇంకా మారలేదు.. ఎప్పుడో మారుతుందో కూడా చెప్పలేం!

