ఒక్కసారి ఇలా ఊహించండి. ఉదయం మీరు నిద్రలేవగానే మీ ఇంట్లో ఒక రోబో మీకు గుడ్ మార్నింగ్ చెబుతుంది. మీరు చెప్పకముందే ఇల్లు శుభ్రం చేస్తుంది. మీకు కాఫీ తీసుకొస్తుంది. ఇంట్లోని చిన్న చిన్న పనులన్నీ చూసుకుంటుంది. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాలో కనిపించే సన్నివేశం అనుకుంటున్నారా? కాదు..కాదండి..! ప్రపంచం ఇప్పుడు నిజంగానే ఈ దిశగా పరుగులు తీస్తోంది. అంతేకాదు, ఆ రోబోను కొనాల్సిన అవసరమే లేదు. నెలకు అద్దె చెల్లిస్తే చాలు.
ఆస్పత్రుల్లో రోబోలు:
అమెరికాలోని చాలా ఆస్పత్రుల్లో ఇప్పటికే మోక్సీ అనే రోబో నర్సులతో కలిసి పనిచేస్తోంది. దాదాపు నాలుగు అడుగుల ఎత్తున్న ఈ తెల్లటి రోబో మందులు, వైద్య సామగ్రిని ఒక విభాగం నుంచి మరో విభాగానికి తీసుకెళ్తుంది.
ఆస్పత్రి సిబ్బంది దీనికి గుడ్ మార్నింగ్ చెబుతారు. హై ఫైవ్ ఇస్తారు. కొందరు ప్రేమగా హగ్ కూడా చేస్తారు. మోక్సీ కూడా తన గుండె ఆకారంలో కనిపించే LED కళ్లను వెలిగిస్తూ బీప్ బీప్ అంటూ పలకరిస్తుంది. దీంతో ఆస్పత్రి ఉద్యోగులు దీన్ని తమ టీమ్ మెంబర్‌గానే భావిస్తున్నారట. ఈ రోబోను తయారు చేసిన డిలిజెంట్ రోబోటిక్స్ కంపెనీ ఇప్పటివరకు వందకు పైగా మోక్సీ రోబోలను ఆస్పత్రుల్లో పనిచేయిస్తోంది. అయితే ఆస్పత్రులు ఈ రోబోలను కొనడం లేదు. నెలవారీ అద్దె పద్ధతిలో ఉపయోగిస్తున్నాయి. దీన్ని ‘రోబోటిక్స్ యాజ్ ఏ సర్వీస్’ అని పిలుస్తున్నారు. అంటే రోబోతో పాటు సర్వీస్, రిపేర్లు, సాఫ్ట్వేర్ అప్‌డేట్లు అన్నీ కంపెనీయే చూసుకుంటుంది. అవసరమైతే దూరంలో కూర్చున్న ఇంజినీర్ కూడా రోబోను నియంత్రించగలడు.
ఈ విధానం వల్ల ఆస్పత్రులకు ఒకేసారి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. రోబోటిక్స్ టెక్నాలజీ చాలా వేగంగా మారిపోతుండటంతో కొత్త సాఫ్ట్వేర్, కొత్త ఫీచర్లు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తుంటాయి. కాబట్టి పాత మోడల్ కొనేసి ఇరుక్కుపోయే పరిస్థితి ఉండదు.
ఇప్పుడు ఈ అద్దె రోబోలు ఆస్పత్రులకే పరిమితం కావడం లేదు. వ్యవసాయ పొలాల్లో కలుపు మొక్కలు తొలగించే రోబోలు, ఫ్యాక్టరీల్లో పనిచేసే రోబోలు, బార్ టెండర్లుగా డ్రింక్స్ అందించే రోబోలు కూడా అద్దెకు దొరుకుతున్నాయి. ఇక మనుషుల్లా కనిపించే హ్యూమనాయిడ్ రోబోలు కూడా ఈ జాబితాలో చేరిపోయాయి. ప్రస్తుతం ఈ హ్యూమనాయిడ్ రోబోలు పెళ్లిళ్లు, కార్పొరేట్ ఈవెంట్లలో డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం, అతిథులకు సేవలు అందించడం లాంటి పనులు చేస్తున్నాయి. ఒక మనిషి డ్యాన్స్ చేసిన వీడియోను చూపించి రోబోకు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత అదే స్టెప్పులను రోబో కూడా చేస్తుంది. అయితే ఇంకా టెక్నాలజీ పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో ఇంజినీర్లు కూడా రోబో వెంట ఉంటున్నారు.
ఇక భవిష్యత్తు మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది. అమెరికాకు చెందిన వన్ ఎక్స్ అనే కంపెనీ నియో అనే ఇంటి సహాయక రోబోను ఈ ఏడాదే మార్కెట్లోకి తీసుకురానుంది. దీన్ని పూర్తిగా కొనాలంటే దాదాపు 17 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే నెలకు సుమారు 43 వేల రూపాయలు చెల్లిస్తే అద్దె పద్ధతిలో కూడా ఉపయోగించుకోవచ్చు. దీంతో ఒకేసారి భారీ మొత్తం చెల్లించలేని వారికి కూడా ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది.
మరోవైపు ప్రతి ఏడాది కొత్త రోబో మోడళ్లు వస్తున్నాయి. ఒకసారి రోబో కొంటే అది కొద్ది కాలంలోనే పాత మోడల్ అయిపోవచ్చు కానీ అద్దె విధానంలో ఉంటే ఎప్పటికప్పుడు కొత్త మోడల్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు రోబోలో ఏదైనా సమస్య వస్తే కోడింగ్ నేర్చుకోవాల్సిన పని లేదు. కంపెనీనే వచ్చి దాన్ని సరిచేస్తుంది. ఫ్యాక్టరీల కోసం పనిచేసే ఫార్మిక్ అనే కంపెనీ ఇప్పటికే 250కు పైగా ఇండస్ట్రియల్ రోబోలను అద్దెకు అందిస్తోంది. రోబోలో ఏ భాగం పాడైనా కంపెనీయే కొత్తది తీసుకొచ్చి మారుస్తుంది. దీంతో చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఇప్పుడు భారీ పెట్టుబడులు పెట్టకుండా రోబోలను ఉపయోగిస్తున్నాయి.
ఇటు చైనాలో రోబోల అద్దె వ్యాపారం మరింత వేగంగా పెరుగుతోంది. హోటళ్లలో ఉద్యోగుల్లా పనిచేయడం, క్లీనింగ్ సర్వీసుల్లో సేవలు అందించడం లాంటి పనులకు హ్యూమనాయిడ్ రోబోలను అద్దెకు ఇస్తున్నారు. అక్కడి అజిబాట్ అనే సంస్థ తమ రోబోలను ఇప్పటికే 17 దేశాల్లో అద్దెకు అందుబాటులోకి తీసుకొచ్చింది. నిజానికి ఒకప్పుడు కారు అద్దెకు తీసుకోవడం, ఇల్లు అద్దెకు తీసుకోవడం మాత్రమే తెలుసు. ఇప్పుడు రోబోలను కూడా అద్దెకు తీసుకునే కాలం మొదలైందని క్లియర్‌కట్‌గా చెప్పవచ్చు.

