Explainer: 14,500కిలోమీటర్లు పొడవు.. రాక్షస అల మేల్కొందా?

Elnino Explained

Elnino Explained

పసిఫిక్ మహాసముద్రం కింద ఒక అసాధారణ కదలిక మొదలైంది. దాని పొడవు దాదాపు 14 వేల 500 కిలోమీటర్లు. అది సునామీ కాదు. భూకంపం కాదు. కంటికి కనిపించే సాధారణ సముద్ర అల కూడా కాదు. అయినా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తల ఫోకస్ అంతా ఇప్పుడు దానిపైనే ఉంది. ఎందుకంటే గతంలో ఇలాంటి భారీ వెచ్చని నీటి ప్రవాహం పసిఫిక్ మహాసముద్రం దాటిన ప్రతిసారీ ప్రపంచ వాతావరణంలో పెద్ద మార్పులు జరిగాయి. కొన్ని దేశాలు తీవ్ర కరువును ఎదుర్కొన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు నమోదయ్యాయి. ఇప్పుడు మరోసారి అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. అంతరిక్షంలో తిరుగుతున్న ఒక ఉపగ్రహం సముద్రం మీద జరిగిన చిన్న మార్పును గుర్తించడంతో ఈ కథ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇంతకి పసిఫిక్ మహాసముద్రం అడుగున ఏం జరుగుతోంది? ఈ 14,500 కిలోమీటర్ల వెచ్చని నీటి ప్రవాహం ఎందుకు అంత ఆందోళన కలిగిస్తోంది? ఇది ఎల్‌నినోకు ఎలా దారితీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం!

కెల్విన్ వేవ్ అంటే?

ముందుగా ఈ 14 వేల 500 కిలోమీటర్ల ప్రవాహం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది సముద్రం లోతుల్లో వెచ్చని నీరు తూర్పు దిశగా నెమ్మదిగా కదిలే ఒక భారీ ఉష్ణ ప్రవాహం. వాతావరణ శాస్త్రవేత్తలు దీన్ని కెల్విన్ వేవ్ అని పిలుస్తారు. ఈ ప్రవాహం ఒక్క రోజులో ఏర్పడదు. ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లదు. నెలల తరబడి సముద్రం అడుగున నెమ్మదిగా ప్రయాణిస్తూ వేల కిలోమీటర్ల దూరం దాటుతుంది. అందుకే ఇది కంటికి కనిపించకపోయినా ప్రపంచ వాతావరణాన్ని మార్చే శక్తి కలిగిన సహజ ప్రక్రియగా భావిస్తారు. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు నుంచి పడమర వైపు వీచే గాలులు ఇండోనేషియా వైపు వెచ్చని నీటిని నెట్టుకుంటూ ఉంటాయి. అదే సమయంలో దక్షిణ అమెరికాలోని పెరూ తీరానికి దగ్గర సముద్రం లోతుల్లో ఉన్న చల్లటి నీరు పైకి వస్తూ అక్కడి సముద్ర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ గాలులు బలహీనపడతాయి. అప్పుడు ఇండోనేషియా దగ్గర పేరుకుపోయిన వెచ్చని నీరు తిరిగి తూర్పు వైపు ప్రయాణం మొదలుపెడుతుంది. అదే కెల్విన్ వేవ్.

ఎల్‌నినో అంటే?

ఈ వెచ్చని నీరు ముందుకు కదులుతున్న కొద్దీ సముద్రం ఉపరితలం స్వల్పంగా పైకి లేస్తుంది. అది కొన్ని సెంటీమీటర్లే అయినా ఉపగ్రహాలకు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి కూడా అదే జరిగింది. నాసా భాగస్వామ్యంతో పనిచేస్తున్న సెంటినెల్ సిక్స్ ఉపగ్రహం పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర మట్టం కొన్ని ప్రాంతాల్లో దాదాపు 15 సెంటీమీటర్లు పెరిగినట్లు గుర్తించింది. అది సాధారణ మార్పు కాదని శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆ మార్పు కింద వేల కిలోమీటర్ల పొడవైన వెచ్చని నీటి ప్రవాహం ప్రయాణిస్తోంది. ఈ వెచ్చని నీరు తూర్పు పసిఫిక్ వరకు చేరిన తర్వాత అసలు ప్రభావం మొదలవుతుంది. సముద్రం లోతుల్లో ఉన్న చల్లటి నీరు పైకి రావడం తగ్గిపోతుంది. దీనికారణంగా తూర్పు పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది. ఈ పరిస్థితినే ఎల్‌నినో అంటారు.

ఇది భూమి వాతావరణ వ్యవస్థను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన సైకిల్స్‌లో ఒకటి. ఎల్‌నినో ఏర్పడిన తర్వాత ప్రభావం ఒక్క పసిఫిక్ మహాసముద్రానికే పరిమితం కాదు.. గాలుల దిశలు మారతాయి. వర్షాల పంపిణీ మారుతుంది. కొన్ని దేశాల్లో తీవ్ర ఎండలు పడితే మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అడవుల్లో కార్చిచ్చు ప్రమాదం పెరగవచ్చు. వ్యవసాయంపై ప్రభావం పడుతుంది. సముద్ర జీవవ్యవస్థ కూడా మారుతుంది.

ముఖ్యంగా పెరూ తీరానికి దగ్గర చల్లటి నీరు పైకి రాకపోవడంతో పోషకాలు తగ్గి చేపల ఉత్పత్తి కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇటు భారత్‌లో ఎల్‌నినో పేరు వినిపించిన ప్రతిసారీ ఎక్కువగా చర్చ జరిగేది నైరుతి రుతుపవనాల గురించే. బలమైన ఎల్‌నినో సంవత్సరాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రతిసారీ అదే జరుగుతుందని చెప్పలేం.

ఎందుకంటే భారత మహాసముద్రంలో ఏర్పడే ఇండియన్ ఓషన్ డైపోల్ లాంటి ఇతర వాతావరణ పరిస్థితులు కూడా రుతుపవనాలపై ప్రభావం చూపుతాయి. అందుకే శాస్త్రవేత్తలు ఒక్క ఎల్‌నినో ఆధారంగా వర్షాలను అంచనా వేయకుండా అన్ని అంశాలను కలిసి పరిశీలిస్తుంటారు. ప్రస్తుతం అమెరికా వాతావరణ సంస్థ ఎల్‌నినో అధికారికంగా ఏర్పడినట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి ఇది మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తల చూపు అంతా పసిఫిక్ మహాసముద్రంపైనే ఉంది. ఎందుకంటే సముద్రం అడుగున నెమ్మదిగా మొదలైన ఒక సహజ ప్రక్రియ రానున్న నెలల్లో ప్రపంచంలోని కోట్లాది మంది జీవితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందా లేదా అన్నదే అసలు మిస్టరీ.