MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!

Maldives

Maldives

ప్రపంచంలో అత్యంత సుందరమైన పర్యాటక ప్రదేశం మాల్దీవులు. ఎంతో మందికి ఇదొక డ్రీమ్ డెస్టినేషన్. మాల్దీవుల అందాలను ఆస్వాదిస్తూ సముద్రతీరంలో సేద తీరేందుకు చాలా మంది ఇష్టపడతారు. అయితే ఇంకొన్నేళ్లలో మాల్దీవులు ప్రపంచ పటం నుంచి కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న విషయం మీకు తెలుసా? ఒక దేశం మొత్తం సముద్రంలో కలిసిపోయే పరిస్థితులు రాబోతున్నాయంటే మీరు నమ్ముతారా…? నమ్మి తీరాలి. ఎందుకంటే ఇదే నిజం… మాల్దీవులకు ఎందుకిలా జరగబోతోంది…? ఆ దేశం చేసిన తప్పేంటి?

మాల్దీవులు ఆసియాలోనే అతిచిన్న దేశం. ఇక్కడ 99 శాతం నీరు, ఒక శాతం మాత్రమే భూమి ఉంటుంది. ఏటా 20 లక్షల మందికి పైగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు పర్యాటకరంగమే మూల స్తంభం. కానీ త్వరలో పర్యాటకులెవరూ అక్కడికి వెళ్లలేకపోవచ్చు. ఎందుకంటే ఆ దేశమే ఉండకపోవచ్చు. చరిత్ర పుస్తకాల్లో మాల్దీవులు అనే దేశం ఉందని చదువుకోవాల్సి రావొచ్చు. దీనికి కారణం ఒక్కటే… భూతాపం కారణంగా గ్లేసియర్లు కరిగి సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. మాల్దీవులు సముద్ర మట్టానికి కేవలం 1.5 మీటర్ల ఎత్తులో ఉండటంతో ముప్పు తీవ్రంగా ఉంది. 2050 నాటికి 9 చిన్న దీవుల సమూహమైన తువాలు.. సగం నీట మునిగిపోతుందని అంచనా. అదే తరహాలో మాల్దీవులు కూడా తెరమరుగుకాబోతోంది.

మాల్దీవులు మాయమైపోతే… ఆ పాపం ప్రపంచం మొత్తానిదే అని చెప్పాలి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు… తమ స్వార్థ ప్రయోజనాల కోసం గ్లోబల్ వార్మింగ్‌ను పట్టించుకోవడం మానేశాయి. కార్గన్ ఉద్గారాల విషయంలో ముసలి కన్నీరు కారుస్తున్నాయి. ఈ సంక్షోభ తీవ్రతను గుర్తించిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఇటీవల సముద్ర మట్టాల పెరుగుదలపై ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇది భవిష్యత్తు అస్తిత్వానికి ముప్పుగా ప్రకటించింది. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా 2100 నాటికి సముద్ర మట్టాలు 50 సెంటీమీటర్లు పెరగడం ఖాయం. ఉద్గారాలు తగ్గించినా ఈ ప్రమాదాన్ని ఆపలేం. ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మంది కోస్తా తీర ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. మన దేశంలోని కోల్‌కతా, ముంబై నగరాలు సైతం ఈ ముప్పు జాబితాలో ఉన్నాయి. సుమారు 1.4 కోట్ల మంది నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉంది.

ఇది కేవలం మాల్దీవుల సమస్య మాత్రమే కాదు… భారత్ సహా సముద్ర తీర ప్రాంతాలు ఈ క్రైసిస్‌ను ఇప్పటికే అనుభవిస్తున్నాయి. భూభాగాలు నీట మునిగితే భారీ ఆర్థిక సవాళ్లు తప్పవు. వలసల కారణంగా జీవన వ్యయం అమాంతం పెరుగుతుంది. ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం సముద్ర మార్గం ద్వారానే జరుగుతోంది. ఓడరేవులు మునిగిపోతే భారత్ లాంటి దేశాలకు దిగుమతులు, ఎగుమతులు కష్టమవుతాయి. పరిశ్రమలకు ముడిసరుకు అందక ఉత్పత్తి తగ్గిపోతుంది. వ్యాపారాలు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పర్యాటకం, మత్స్య పరిశ్రమలపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. 2050 నాటికి కరేబియన్ దీవులు 17 శాతం పర్యాటక ఆదాయాన్ని కోల్పోతాయని అంచనా.

దీని వల్ల ఎవరూ ఊహించని మరో సమస్య రాబోతోంది. అదే భవిష్యత్తులో ఎదురుకానున్న బీమా సంక్షోభం. వరదలు, తుఫాన్ల ముప్పు పెరిగే కొద్దీ బీమా కంపెనీలు భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. దాన్ని తట్టుకునేందుకు కంపెనీలు ప్రీమియం రేట్లను పెంచేస్తాయి. కవరేజీని తగ్గించడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో బీమా ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. అమెరికాలో ఇప్పటికే ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఆస్తుల విలువ పడిపోతుంది. బ్యాంకు రుణాలు ఇవ్వడానికి సైతం వెనకడుగు వేస్తాయి.

ఒక దేశం పూర్తిగా నీట మునిగితే కేవలం ఆర్థిక నష్టమే కాదు.. వారసత్వం, గుర్తింపు కనుమరుగవుతాయి. గ్లోబల్ ఎమిషన్స్ లో అతి తక్కువ వాటా ఉన్న చిన్న దేశాలకు ఇది తీరని అన్యాయం. భూభాగం కోల్పోయిన తర్వాత ఆ దేశ ప్రభుత్వ పాలన ఎలా సాగుతుందన్నది పెద్ద ప్రశ్న. ప్రజల హక్కులు, పౌరసత్వం, మత్స్య హక్కుల పరిస్థితి ఏంటన్న దానిపై ప్రస్తుత అంతర్జాతీయ చట్టాల్లో స్పష్టత లేదు. దేశ భూభాగం మునిగిపోయినంత మాత్రాన ఆ దేశ ఉనికి కోల్పోయినట్లు కాదని ఐక్యరాజ్యసమితి తీర్మానం స్పష్టం చేస్తోంది.

ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నాయి. భవిష్యత్ తరాల కోసం మెటావర్స్ లో డిజిటల్ రిప్లికాను తయారు చేస్తున్నాయి. తువాలు దేశం ఇప్పటికే ల్యాండ్ రికార్డులను డిజిటలైజ్ చేస్తోంది. సముద్ర మట్టాలను అంచనా వేసేందుకు తీరప్రాంతాల్లో సెన్సార్లను ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో కృత్రిమ దీవులను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. పారిస్ ఒప్పందం ప్రకారం దేశాలన్నీ 2035 నాటికి కర్బన ఉద్గారాలను 60 శాతం మేర తగ్గించాలి. నిధుల సమీకరణ సైతం వేగవంతం చేయాలి.