Unemployment Crisis: చేతిలో డిగ్రీ ఉన్నా ఉద్యోగం ఎందుకు దొరకడం లేదు? షాకింగ్ రిపోర్ట్

India Unemployment Crisis

India Unemployment Crisis

డిగ్రీ ఉంటే లైఫ్ సెట్ అంటారు. బాగా చదివితే మంచి ఉద్యోగం గ్యారెంటీ అంటారు. కానీ ఇప్పుడు అదే డిగ్రీ చేతిలో పట్టుకుని లక్షల మంది యువత కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. రెజ్యూమ్‌లు పంపిస్తున్నారు. ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు. అయినా ఉద్యోగం మాత్రం దొరకడం లేదు. ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? డిగ్రీ విలువ తగ్గిపోయిందా? లేదా ఉద్యోగాలే లేవా?

ప్రస్తుతం ఇండియాలో ఉద్యోగం లేకుండా ఉన్న ప్రతి ముగ్గురు యువతలో ఇద్దరు గ్రాడ్యుయేట్లే. అవును…! వారంతా డిగ్రీ పూర్తి చేసిన వాళ్లే. కానీ 1983లో ఇలాంటి పరిస్థితి లేదు. అప్పుడు 8 మంది నిరుద్యోగుల్లో కేవలం ఒక్కరికి మాత్రమే డిగ్రీ ఉండేది. ఇప్పుడు ఆ లెక్క పూర్తిగా తలకిందులైంది. చదువుకున్న వాళ్లు పెరిగారు. కానీ వాళ్ల కోసం ఉద్యోగాలు మాత్రం అదే స్పీడ్‌లో పెరగలేదు.

అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ విడుదల చేసిన 2026 స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం 1983లో దేశంలో 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న గ్రాడ్యుయేట్లు కేవలం 50 లక్షలు మాత్రమే. ఇప్పుడు అదే సంఖ్య 6 కోట్ల 30లక్షలకు చేరింది. అంటే 13 రెట్లు పెరిగింది. కానీ ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్లు 7 లక్షల నుంచి కోటి 10లక్షలకు చేరుకున్నారు. అంటే గ్రాడ్యుయేట్ల కంటే నిరుద్యోగ గ్రాడ్యుయేట్ల పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉంది. ఇదే ఇప్పుడు ఇండియా ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్యారడాక్స్. నిజానికి ఇండియాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కాలేజీల సంఖ్య పెరిగింది. యూనివర్సిటీలు పెరిగాయి. సీట్లు పెరిగాయి. ప్రతి ఇంట్లో ఒక గ్రాడ్యుయేట్ కనిపించే పరిస్థితి వచ్చింది. కానీ కాలేజ్ గేట్ దాటిన తర్వాత ఉద్యోగం దొరికే దారి మాత్రం అంత వేగంగా తెరుచుకోలేదు.

అందుకే చేతిలో డిగ్రీ ఉన్నా జేబులో జీతం లేదనే పరిస్థితి చాలామందికి ఎదురవుతోంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్ల నిరుద్యోగం 1983లో 35శాతం ఉంటే 2023లో 39.3శాతంగా ఉంది. అంటే 40 ఏళ్లు గడిచినా పెద్దగా మారింది ఏమీ లేదు. కానీ ఈ శాతంలో నిలబడి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య మాత్రం ఎన్నో రెట్లు పెరిగిపోయింది. అంటే ఇండియా డిగ్రీలు ఇవ్వడంలో సక్సెస్ అయింది కానీ ఆ డిగ్రీలకు తగ్గ ఉద్యోగాలు సృష్టించడంలో మాత్రం ఇంకా వెనుకబడిపోయింది.

25 నుంచి 29 ఏళ్ల వయసు వాళ్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ వయసులో నిరుద్యోగం 1983లో 12.2శాతం ఉండగా 2023లో 20శాతానికి చేరింది. అంటే చదువు పూర్తయ్యాక వెంటనే ఉద్యోగం దొరికే రోజులు తగ్గిపోతున్నాయి. ఉద్యోగం కోసం వెయిట్ చేసే సమయం ఇప్పుడు యువత జీవితంలో కీలకమైన సంవత్సరాలను తీసేస్తోంది. వాస్తవానికి 2004 నుంచి 2023 వరకు ప్రతి ఏడాది సగటున 50 లక్షల మంది కొత్త గ్రాడ్యుయేట్లు బయటకు వచ్చారు. కానీ వారిలో 28 లక్షల మందికి మాత్రమే ఏదో ఒక పని దొరికింది. అందులో కూడా స్థిరమైన జీతంతో ఉద్యోగం సంపాదించిన వాళ్లు కేవలం 17 లక్షల మంది మాత్రమే. అంటే ప్రతి ఏడాది దాదాపు 33 లక్షల మంది గ్రాడ్యుయేట్లకు సరైన జీతంతో ఉద్యోగం దొరకడం లేదు.

ఇంకో ఆసక్తికరమైన విషయం రాష్ట్రాల మధ్య ఉన్న తేడా. 30 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్ పురుషుల్లో ఢిల్లీలో నిరుద్యోగం 8.8శాతం మాత్రమే. కానీ ఒడిశాలో అది 40.3శాతంగా ఉంది. మహిళల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. జమ్ముకశ్మీర్‌లో 73.5శాతం, తెలంగాణలో 52.3శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 51.6శాతం గ్రాడ్యుయేట్ మహిళలు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు.

దేశ సగటు చూస్తే పురుషుల్లో 25.1శాతం, మహిళల్లో 36.6శాతం నిరుద్యోగం ఉంది. అంటే దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ మహిళలకే ఉద్యోగం దొరకడం మరింత కష్టంగా మారింది. 2025 వరకు ఉన్న ప్రభుత్వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కూడా ఇదే సంకేతాలు ఇస్తోంది. అన్ని వయసుల గ్రాడ్యుయేట్లను కలిపి చూస్తే దేశంలో నిరుద్యోగం 11.2శాతంగా ఉంటే.. పురుషుల్లో అది 9శాతం, మహిళల్లో 17.4శాతంగా రికార్డయింది. అంటే మహిళా గ్రాడ్యుయేట్ల నిరుద్యోగం దాదాపు రెట్టింపు స్థాయిలో ఉంది. అయితే దీన్ని చూసి డిగ్రీకి విలువ లేదని అనుకోవద్దు. ఉద్యోగం దొరికితే గ్రాడ్యుయేట్ల జీతం డిగ్రీ లేని వాళ్ల కంటే దాదాపు 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కెరీర్ మొత్తం చూసినా వాళ్ల ఆదాయం ఎక్కువే ఉంటుంది. కానీ సమస్య ఒక్కటే. ఆ మొదటి ఉద్యోగం దొరకడానికి ఇప్పుడు చాలా ఎక్కువ సమయం పడుతోంది. పైగా 2017 తర్వాత గ్రాడ్యుయేట్ల జీతాల పెరుగుదల కూడా నెమ్మదించింది. ఇక్కడ మరో పెద్ద విషయం కూడా ఉంది. పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుందని కుటుంబాలు భారీగా ఖర్చు చేస్తున్నాయి.

2025లో హయ్యర్ సెకండరీ చదివే విద్యార్థుల్లో 37శాతం మంది ప్రైవేట్ కోచింగ్ తీసుకుంటున్నారు. ఒక్కో విద్యార్థిపై స్కూల్ కోసం సగటున 20,130 రూపాయలు ఖర్చు చేస్తే, కోచింగ్ కోసమే మరో 6,380 రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

అంటే మంచి ఉద్యోగం వస్తుందనే ఆశతో కుటుంబాలు వేల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాయి. కానీ ఆ పెట్టుబడికి వెంటనే రిటర్న్ రావడం లేదు. ఇటీవల నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా భారత యువతే దేశానికి అతిపెద్ద బలం అన్నారు. ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్‌ను డెవలప్‌మెంట్ డివిడెండ్‌గా మార్చాలని పిలుపునిచ్చారు. కానీ ఈ రిపోర్ట్ చెబుతున్న అసలు మెసేజ్ ఒక్కటే.

ఇండియా చదివించే పని చేసింది. డిగ్రీలు ఇచ్చింది. యువతను తయారు చేసింది. ఇప్పుడు మిగిలింది ఒక్కటే. ఆ యువత కోసం పెద్ద ఎత్తున నాణ్యమైన ఉద్యోగాలు సృష్టించడం. లేదంటే చేతిలో డిగ్రీ ఉన్నా… జీవితానికి దారి వెతుక్కుంటూ తిరిగే యువత సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అదే ఈ రిపోర్ట్ ఇస్తున్న అతిపెద్ద హెచ్చరిక.