GREEN CRACKERS: ఈ దీపావళికి ఊపిరి పీల్చుకోవడం సాధ్యమేనా?

Diwali Pollution Explained

Diwali Pollution Explained

దీపావళి పండుగ దగ్గరపడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్కెట్లలో కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే అమ్మాలి. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. గ్రీన్ క్రాకర్స్ ముసుగులో సాధారణ బాణాసంచా మార్కెట్లోకి వెల్లువలా వస్తోంది. అసలు ఢిల్లీ మార్కెట్లలో ఏం జరుగుతోంది? ఈ పండుగకు ఢిల్లీ ఊపిరి పీల్చుకోవడం సాధ్యమేనా?

దీపావళి రాకముందే ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతోంది. దసరా వేడుకల మరుసటి రోజుకే AQI 245కు చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వాయు కాలుష్యం కారణంగా బాణాసంచా అమ్మకాలపై సుప్రీంకోర్టు గతంలోనే కీలక ఆదేశాలు జారీ చేసింది. పూర్తి స్థాయి నిషేధం విధించకుండా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని కేవలం గ్రీన్ క్రాకర్స్ వాడకానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. అయితే బేరియం రసాయనం వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది. అక్టోబర్ 29న కోర్టులో ఈ అంశంపై తదుపరి విచారణ జరగనుంది.

దీపావళికి మరో రెండు వారాల సమయం ఉండగానే సదర్ బజార్, జామా మసీదు ప్రాంతాల్లో బాణాసంచా అమ్మకాలు ఊపందుకున్నాయి. పర్యావరణహితం, కాలుష్యం లేనివి అంటూ బోర్డులు పెట్టి వ్యాపారులు దొడ్డిదారిన విక్రయాలు సాగిస్తున్నారు. మార్కెట్లో యువత ఎలాంటి ఆంక్షలు లేకుండా సులభంగా పెద్ద ఎత్తున పటాకులు కొనుగోలు చేస్తున్నారు. ప్యాకింగ్ ఆకుపచ్చ రంగులో ఉండటంతో కొనుగోలుదారులు అవి నిజంగానే గ్రీన్ క్రాకర్స్ అని భ్రమపడుతున్నారు. దుకాణదారులు మాత్రం అసలు క్రాకర్స్ ను ప్లాస్టిక్ షీట్ల వెనుక దాచిపెట్టి, కొనుగోలుదారులకు రహస్యంగా అమ్ముతున్నారు.

నిజమైన గ్రీన్ క్రాకర్స్‌ను గుర్తించేందుకు CSIR-NEERI ధృవీకరణతో కూడిన క్యూఆర్ కోడ్ తప్పనిసరి. మార్కెట్లో అందుబాటులో ఉన్న క్రాకర్స్ లో చాలా వాటికి ఈ క్యూఆర్ కోడ్ ఉండటం లేదు. గ్రీన్ లేబుల్ అనేది కేవలం వ్యాపార జిమ్మిక్కుగా మారిపోయింది. డిజిటల్ ఆధారాలు దొరకకుండా ఉండేందుకు వ్యాపారులు కస్టమర్ల నుంచి ఆన్ లైన్ పేమెంట్లు స్వీకరించడం లేదు. బిల్లులు ఇవ్వకుండా కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు సాగిస్తూ అధికారుల కళ్లు గప్పుతున్నారు.

మార్కెట్లో విచ్చలవిడిగా జరుగుతున్న ఈ అక్రమాలపై పర్యావరణ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని బాణాసంచా అంటూ ఏదీ లేదని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చెబుతున్నారు. గ్రీన్ క్రాకర్స్ అంటే కేవలం కాల్చినప్పుడు తక్కువ ఉద్గారాలు విడుదల చేసేవి మాత్రమేనని చెబుతున్నారు. సంప్రదాయ క్రాకర్స్ లో ఉండే సూక్ష్మ కణాలు గాలిలో ఎక్కువ కాలం ఉండి శ్వాసకోశ వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండుగ నాటికి ఢిల్లీ గాలి మరింత విషపూరితం కాకుండా అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.