NTV Telugu Site icon

Techie Missing Mystery: వీడిన ఇంజనీర్ మిస్సింగ్ మిస్టరీ.. ఆ బాధలు భరించలేకే..

Techie Rahul Missing Myster

Techie Rahul Missing Myster

Software Engineer Rahul Missing Mystery Revealed: బెంగళూరులో ఈనెల 16వ తేదీన కనిపించకుండా పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాహుల్ (27) మిస్టరీ వీడింది. తన కూతుర్ని చంపడంతో పాటు కిడ్నాప్ డ్రామా ఆడిన ఇతగాడు.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మొబైల్ నెట్‌వర్క్ ఆధారంగా.. అతడ్ని అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే.. గుజరాత్‌కు చెందిన రాహుల్ ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఇతడు భవ్య అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి జియా అనే ఒక కూతురు ఉంది.

కట్ చేస్తే.. ఏడాదిన్నర క్రితం రాహుల్ తన ఉద్యోగం కోల్పోయాడు. అప్పుడు బిట్ కాయిన్‌లో డబ్బులు వస్తాయన్న ఆశతో పెట్టుబడి పెట్టాడు. కానీ, అది బెడిసికొట్టడంతో తీవ్రంగా నష్టపోయాడు. అటు ఉద్యోగం దొరక్క, ఇటు పెట్టుబడిలో నష్టపోవడంతో.. ఖర్చుల కోసం విపరీతంగా అప్పులు చేశాడు. ఈ క్రమంలోనే ఓసారి.. ఇంట్లో బంగారం చోరీ అయ్యిందని తప్పుడు ఫిర్యాదు చేశాడు. ఆ కేసు విచారణకు రావాలని పోలీసులు పిలవగా, భయంతో వెళ్లలేదు. ఓవైపు అప్పులు వాళ్లేమో, ఇంటికి వచ్చి వేధిస్తున్నారు. అప్పులు బాధలు రానురాను మరీ ఎక్కువ అయిపోవడంతో.. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను చనిపోయాక, తన భార్య కూతుర్ని సరిగ్గా చూసుకోదన్న ఉద్దేశంతో, ఆ పాపని కూడా చంపేయాలని ఫిక్స్ అయ్యాడు.

ప్లాన్ ప్రకారం.. నవంబర్‌ 15వ తేదీన జియాను స్కూల్‌లో వదిలేసి వస్తానని బయలుదేరాడు. కూతుర్ని కారులోనే గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేసి, తాను కూడా చెరువులో దూకాడు. అయితే.. లోతు తక్కువగా ఉండటంతో బతికిపోయాడు. ఎలాగైనా చావాలనుకొని.. రైలు కింద పడేందుకు ప్రయత్నించాడు. కానీ, భయంతో ఆ పని చేయలేకపోయాడు. రైలెక్కి, చైన్నై చేరుకున్నాడు. అక్కడ తన సంబంధీకులకు ఫోన్ చేసి.. తననెవరో కిడ్నాప్ చేశారని నాటకం ఆడాడు. మొబైల్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా.. రాహుల్‌ ఆంధ్రప్రదేశ్‌ నుంచి బెంగళూరుకు రైలులో వస్తున్నాడని తెలుసుకుని, పోలీసులు అతడ్ని గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో.. అప్పుల బాధతోనే ఈ పని చేశానని రాహుల్ అన్ని విషయాలు బయటపెట్టాడు.