Site icon NTV Telugu

Smoking in Airplane: విమానంలో సిగరెట్ తాగిన బాడీ బిల్డర్‌. దర్యాప్తుకు ఆదేశించిన కేంద్ర మంత్రి

Smoking In Airplane

Smoking In Airplane

Smoking in Airplane: రూల్స్‌ ప్రకారం.. విమానంలో ప్రయాణించేటప్పుడు అగ్గిపెట్టెలు, లైటర్లు తీసుకెళ్లకూడదు. సహజంగా ప్రి-బోర్డింగ్‌ సెక్యూరిటీ తనిఖీల్లోనే ఇలాంటివాటిని గుర్తిస్తారు. కానీ ఏం జరిగిందో తెలియదు. బల్విందర్‌ కటారియా అనే బాడీబిల్డర్‌ విమానంలో ప్రయాణిస్తూ సిగరెట్‌ తాగిన వీడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విచారణకు ఆదేశించారు. ఇలాంటి ప్రమాదకరమైన ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, నిబంధనలను అతిక్రమించటాన్ని ఉపేక్షించే ప్రసక్తేలేదని హెచ్చరించారు.

వాస్తవానికి ఈ ఘటన ఈ ఏడాది జనవరి 23వ తేదీన చోటుచేసుకుంది. బాబీ కటారియాగా ఫేమస్‌ అయిన అతను స్పైస్‌ జెట్‌ విమానంలో దుబాయ్‌ నుంచి న్యూఢిల్లీ వస్తున్నప్పుడు ఇలా నిర్లక్ష్యంగా సిగరెట్‌ తాగాడు. ఈ పాత వీడియోని నితీష్‌ భరద్వాజ్‌ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పెట్టి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాని, డీజీసీఏని, సీఐఎస్‌ఎఫ్‌ని ట్యాగ్‌ చేయటంతో వైరల్‌గా మారింది. దీంతో జ్యోతిరాదిత్య సింధియా వెంటనే స్పందించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. దీనిపై బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ వివరణ ఇచ్చింది.

Jana gana mana-telangana: తెలంగాణలోని ఆ ప్రాంతాల్లో ‘జన గణ మన’ ఒక నిత్య ఆలాపన

నిందితుడిపై అప్పట్లోనే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని పేర్కొంది. హర్యానాకు చెందిన బాబీ కటారియా సోషల్‌ మీడియా స్టార్‌. ఈ వీడియోని అతని సోషల్‌ మీడియా పేజీల నుంచే తీసుకున్నట్లు తెలుస్తోంది. అతనిపై గతంలో పలు నేరారోపణలు వచ్చాయి. ఇండియాలో టిక్‌టాక్‌ ఉన్నప్పుడు ఇలాంటి వీడియోలను రెగ్యులర్‌గా షేర్‌ చేయటం ద్వారా పాపులర్‌ అయ్యాడు. ఇప్పుడు టిక్‌టాక్‌ లేకపోవటంతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తున్నాడు. అతను విమానంలో ప్రయాణిస్తూ సిగరెట్‌ తాగటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. బాబీ కోసం కొత్త రూల్స్‌ ఏమైనా ప్రవేశపెట్టారా? అని నిలదీశారు.

ఈ ఘటన.. మొత్తం విమానయాన భద్రతా లోపాలను, నిబంధనల ఉల్లంఘనను పట్టిచూపుతోందని ఆగ్రహం వెలిబుచ్చారు. బాబీ కటారియా భవిష్యత్తులో విమానాలు ఎక్కకుండా నిషేధించాలని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డాడు. ఈ నిందితుడు గతంలో ఓసారి నడిరోడ్డు మీద మందు తాగుతూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగినట్లు సమాచారం. అప్పుడు కూడా ఇలాగే పోలీసులు చూసీచూడనట్లు పైపైన చర్యలు చేపట్టడంతో ఇప్పుడు ఏకంగా విమానంలోనే సిగరెట్‌ తాగే సాహసానికి ఒడిగట్టాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్లైట్‌లో లైటర్‌ వెలిగించినప్పుడు ఏదైనా జరిగితే ఏమై ఉండేదని ప్రశ్నిస్తున్నారు.

 

Exit mobile version