Shankarpally : మేజర్‌ను మైనర్‌గా చూపి అక్రమ కేసు.. శంకర్‌పల్లి సీఐ, ఎస్ఐలపై యువతి సంచలన ఆరోపణలు!

Shankarpally

Shankarpally

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి : తాను మేజర్ అయినప్పటికీ రికార్డుల్లో మైనర్‌గా చూపి తన భర్తను అక్రమంగా రిమాండ్‌కు తరలించారని ఓ నవవధువు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేసింది. శంకర్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ), సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) ల తీరుపై శివాని అనే యువతి విడుదల చేసిన సెల్ఫీ వీడియో స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఇరు కుటుంబాల సమక్షంలోనే వివాహం జరిగిందని శివాని చెప్తుంది. శివాని తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె, హరీశ్వర్ రెడ్డి అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అనంతరం ఇరు కుటుంబాల పెద్దలు, బంధువుల సమక్షంలోనే సంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. అయితే, శంకర్‌పల్లి పోలీసులు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోకుండా, వధువు వయస్సును కావాలనే వివాదాస్పదం చేస్తూ వరుడు హరీశ్వర్ రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారని ఆమె వాపోయింది.

బలవంతంగా మెడికల్ టెస్టులు, బెదిరింపులు:
తాను మేజర్ అయినప్పటికీ, తమ అభీష్టానికి వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.తనకు, తన తల్లిదండ్రులకు ఎంతమాత్రం ఇష్టం లేదని మొరపెట్టుకున్నా వినకుండా పోలీసులు బలవంతంగా ఫిజికల్ (వైద్య) పరీక్షలకు తరలించారని ఆరోపించింది.తమకు ఈ వైద్య పరీక్షలు అవసరం లేదని తల్లిదండ్రులు స్వయంగా స్పష్టం చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని పేర్కొంది.ప్రశ్నించినందుకు తన తల్లిదండ్రులపై కూడా అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతామని సీఐ, ఎస్ఐ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగుతున్నారని శివాని సెల్ఫీ వీడియోలో కన్నీటిపర్యంతమైంది. తమ కుటుంబంపై పోలీసు అధికారులు తీవ్రస్థాయిలో మానసిక ఒత్తిడి తెస్తున్నారని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని, తమకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది వేచిచూడాల్సి ఉంది.