అన్నం పెట్టే బ్యాంకుకే కన్నం పెట్టాడు. రోజుకింత బంగారం తీసుకెళ్లాడు. ఒక్కటి రెండు కాదు బ్యాంక్‌లో తాకట్టు పెట్టిన 402 ఖాతాలకు చెందిన 20 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు తీసుకెళ్లి వేరే బ్యాంకుల్లో తాకట్టుపెట్టి డబ్బులు దారి మల్లించాడు. ఏటీఎంలో నిల్వచేయాల్సిన క్యాష్‌ను కూడా కాజేశాడు. ఏకంగా 13 కోట్లకు పైగా బ్యాంక్ సొత్తును తస్కరించాడు. మరి బ్యాంక్ అధికారులు ఏం చేస్తున్నట్టు? అసలు ఇంతకీ మంచిర్యాల జిల్లా చెన్నూర్ SBI బ్రాంచి 2లో అసలేం జరిగింది? ఇదిగో ఇది మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని SBI రెండవ బ్రాంచి. ఇందులో పనిచేసే రవీందర్ అనే క్యాషియర్… దాదాపు బ్యాంక్ మొత్తాన్ని లూఠీ చేసినంత పనిచేశాడు. బ్యాంక్ మొత్తంలో 449 అకౌంట్లు ఉంటే అందులో 402 ఖాతాలకు చెందిన తాకట్టు పెట్టిన బంగారం తీసుకెళ్లాడు. బ్యాంక్ నుంచి 20.496 కిలోల నగలు ఎత్తుకెళ్లిన ఉద్యోగి రవీందర్ వ్యవహరాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు పోలీసుల పిర్యాదు చేశారు…
నిజానికి స్ట్రాంగ్ రూమ్‌లో రవీందర్ చేస్తున్న బాగోతాన్ని 10 నెలలుగా బ్యాంక్ మేనేజర్ సహా ఇతర సిబ్బంది పసిగట్టలేదు. అచ్చంగా లక్కీ భాస్కర్ సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ చేసిన విధంగానే పని పూర్తి చేశాడు రవీందర్. ఐతే ఓ కస్టమర్ తాను తాకట్టు పెట్టిన ఆభరణాలు విడిపించేందుకు వచ్చాడు. ఆ సమయంలో బంగారం లేకపోవడంతో అనుమానం వచ్చింది. బ్యాంక్ మేనేజర్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అంతర్గత విచారణ చేపట్టారు. దీంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. 13 కోట్ల 71 లక్షల, 27 వేల 617 రూపాయలు అందులో పనిచేసే క్యాషియర్ రవీందర్ తస్కరించినట్లు తేలింది. దీంతో అతన్ని పోలీసులకు అప్పగించారు… క్యాషియర్ నరిగే రవీందర్ బ్యాంక్‌లోని నగలు తీసుకెళ్లి వాటిని వివిధ బ్యాంకులలో తాకట్టు పెట్టారు. ఆతర్వాత వచ్చే డబ్బులను కొంగొండి భీరేష్, నరిగే సరిత, నరిగే స్వర్ణలత, ఉమ్మల సురేష్, కొందాటి రాజశేఖర్, గౌడ సుమన్, ఈసంపల్లి సాయి కిరణ్, ఎల్ సందీప్, మొత్కూరి రమ్య అనే వ్యక్తుల పేర్లతో ఉన్న అకౌంట్లలోకి భారీగా నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు…
MBNR WIFE MURDER : రాంగ్ కాల్‌తో మొదలైన ప్రేమ.. చివరికి అటవీ ప్రాంతంలో భయంకర మలుపు
2024 అక్టోబర్ నుంచి ఆగస్టు20, 2025 వరకు పనిచేసిన క్యాషియర్ రవీందర్ ఈ వ్యవహారం సాగించినట్లు SBI రీజనల్ మేనేజర్ తన ఫిర్యాదులో పేర్కోన్నారు. 402 రుణ ఖాతాలలో బంగారం 20.496 కిలోలు, రూ. 12.61 కోట్లు, ATM నుంచి నికర నగదు రూ. 78, 85,517, రూ. 31,42,100/-, మొత్తం నికర నగదు రూ. 1,10,27,617-, మొత్తం రూ. 13,71,27,617- బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ , ATM నుండి కనిపించకుండా పోయిందని తెలిపారు. నిందితుడు SBI చెన్నూర్ బ్రాంచ్‌లో సీనియర్ అసోసియేట్‌గా , క్యాష్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు. అయితే నెల రోజుల క్రితమే బ్యాంక్‌లో ఆడిట్ జరిగింది. అప్పుడు ఈ విషయం వెలుగులోకి రాలేదు. పైగా బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ కస్టోడియన్‌గా ఉంటారు..వారికి రెండు కీలుంటాయి. కానీ రవీందర్ ఒక్కడే ఇదంతా చేశాడా…మరి అలాగే లూటీ చేస్తుంటే బ్యాంక్ మేనేజర్ ఏం చేశారు? ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రవీందర్ తప్ప బ్యాంక్ సిబ్బంది పాత్ర ఏంటీ? ఇంకా ఎవ్వరి అకౌంట్లలోకి నగదు బదిలీ అయింది? అనేవి తెలియాల్సి ఉంది..
ఇంతలా బ్యాంక్ మొత్తాన్ని దాదాపు లూటీ చేసినంత పనిచేశాడు. బ్యాంక్ మేనేజర్ పాత్ర ఉందా? ఇంకా ఎవరి పాత్ర ఉంది? వందల సార్లు లావాదేవీలు జరగుతున్నా….బ్యాంక్ లోని దాదాపు మొత్తం తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు తస్కరిస్తుంటే ఇక భద్రత ఏం ఉన్నట్లు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు రవీందర్ ఆ డబ్బంతా ఏం చేశాడు? ఎవరైనా వాటాలు పంచుకున్నారా? లేక ఆల్ లైన్ బెట్టింగ్ లో పెట్టాడా? ఆ డబ్బంతా ఏం చేశారనే దానిపై పోలీసులు విచారణ సాగుతోంది…
