SBI Cashier Scam: కళ్ల ముందు కట్టలు కట్టలుగా డబ్బులు.. మరోవైపు బెట్టింగ్ ఆడే అలవాటు.. ఇంకేముంది బ్యాంక్ మనదే అనుకున్నాడు ఆ క్యాషియర్. బ్యాంక్ సొమ్ము సొంతానికి వాడుకుని బెట్టింగ్ అడాడు. నిండా మునిగాడు.. కాదు కాదు బ్యాంకును.. డిపాజిటర్ల సొమ్మును నిండా ముంచాడు. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు కంత్రీ క్యాషియర్. నిందితుడి పేరు నరిగే రవిందర్. ఇతడో బెట్టింగ్ బంగార్రాజు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఆడే అలవాటు ఉంది. మరోవైపు ఇతడు ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులోని SBI బ్రాంచ్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కళ్ల ముందు కట్టలు కట్టలుగా క్యాష్ కనిపిస్తూ ఉంటుంది. బెట్టింగ్ ఆడే అలవాటు ఉన్న రవీందర్.. చేతులు దురద పుట్టాయి. దీంతో బ్యాంక్ సొమ్ము తీసుకుని బెట్టింగ్‌లో పెట్టాడు. మొత్తం రూ. 40 లక్షలు పోగొట్టాడు..
READ ALSO: OG : ఓజీ ప్రమోషన్లకు పవన్ కల్యాణ్ దూరం..?
అంతేకాకుండా రవీందర్ ఇన్‌చార్జిగా ఉన్న లాకర్స్‌లలో కోట్ల రూపాయల విలువైన నగలు ఉంటాయి. దీంతో అతనికి వాటిపైనా దురాశ పుట్టింది. అసలే బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడు. వాటిని ఎలాగైనా పూడ్చుకోవాలని భావించాడు. ఫలితంగా లాకర్స్‌లో ఉండే బంగారాన్ని కొట్టేయాలి అని ప్లాన్ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 కిలోల పైచిలుకు బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. వాటిని తీసుకువెళ్లి ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలలో కుదువ పెట్టాడు. ఆ డబ్బులను బ్యాంకులో జమ చేయకుండా మళ్లీ బెట్టింగ్‌లోనే పెట్టుబడి పెట్టాడు. తను చేస్తున్న పనిని దాచి పెట్టి ఉంచేందుకు చాలా మందిని ఏర్పాటు చేసుకున్నాడు. చివరకు బ్యాంకులో మిస్సయిన బంగారు ఆభరణాలపై అధికారులు ఆరా తీయడంతో క్యాషియర్ రవీందర్ హస్తం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయడంతో రవీందర్‌కు సహకరించిన 46 మంది చిట్టా బయటకు వచ్చింది…
ఈ కేసులో బ్యాంకు మేనేజర్ ఎన్నపు రెడ్డి మనోహర్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి అటెండర్ లక్కాకుల సందీప్‌లతో కలిసి బ్యాంకులో మోసం చేయాలని పథకం వేసినట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకు కరెన్సీ, చెస్ట్ తాళాలు మేనేజర్, క్యాషియర్ ఇద్దరి సంయుక్త ఆధీనంలో ఉండగా మేనేజర్ తన తాళాన్ని క్యాషియర్‌కు ఇచ్చాడని, దీన్ని ఉపయోగించుకుని రవీందర్ బంగారం, నగదును దొంగలించాడని చెబుతున్నారు పోలీసులు. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని బయటకు తీసి తన స్నేహితుడైన ఎస్‌బీఎఫ్‌సీ బ్యాంకు మంచిర్యాల సేల్స్‌మేనేజర్ కొంగొండి బీరయ్య , అదే బ్యాంకు కస్టమర్స్ రిలేషన్ మేనేజర్ కొడపి రాజశేఖర్, బ్యాంకు సేల్స్ ఆఫీసర్ బొల్ల కిషన్‌లకు ఇచ్చేవాడని, వారు ఆ బంగారాన్ని గోల్డ్ ఫైనాన్స్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్‌లు తీసుకుని వచ్చిన డబ్బును ఖాతాల్లో జమ చేసుకుని కొంత కమీషన్ తీసుకుని మిగతా మొత్తాన్ని రవీందర్‌కు పంపేవారన్నారు. ఇలా 10 ప్రైవేటు గోల్డ్ కంపెనీల్లో 44 మంది పేర్లతో 142 గోల్డ్‌లోన్‌లు తీసుకున్నారని పేర్కొన్నారు. అలాగే క్యాషియర్ రవీందర్ తన కుటుంబీకుల పేర్లతో పాటు సన్నిహితుల పేర్లతో 42 నకిలీ ఖాతాలు సృష్టించి బంగారం లేకుండానే గోల్డ్‌లోన్‌లు మంజూరు చేసి 4 కిలోల 14 గ్రాముల బంగారం తాకట్టు పెట్టినట్లు చూపించి కోటి 58 లక్షల రూపాయలు కాజేశాడన్నారు. అలాగే ఏటీఎంలలో డబ్బులు నింపే సమయంలో రవీందర్ చేతివాటం ప్రదర్శించేవాడన్నారు పోలీసులు…
కేసులో 44 మంది నిందితుల అరెస్టు
బ్యాంకులో అవకతవకలు జరిగినట్లు 402 మందికి సంబంధించిన గోల్డ్‌లోన్ అకౌంట్‌లలోని బంగారం 25 కిలోల 17గ్రాములు, 1.10 కోట్లు దుర్వినియోగం అయినట్లు ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ రితీష్‌కుమార్ గుప్తా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగడంతో మొత్తం స్కామ్ బయటకు వచ్చింది. మరోవైపు ఈ కేసులో 15 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో 44 మంది నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు..
READ ALSO: Russia China Iran Support: ఈయూకు షాక్ ఇచ్చిన రష్యా-చైనా.. ఇరాన్‌కు అండగా రెండు దేశాలు..
