Site icon NTV Telugu

ఆర్టీసీ బస్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌.. 10 కి చేరిన మృతుల సంఖ్య

ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు జల్లేరు వాగులో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణీకులు ఉన్నారు. వీరిలో 10 మంది నీట మునిగి మృతిచెందగా… 30 మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి జంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బస్సు ప్రమాదానికి కారణం కచ్చితంగా తెలియకున్నా.. ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను తప్పించపోయి బస్సు వాగులో పడిందంటున్నారు అందులోని ప్రయాణికుడు.

తన ఎదురుగానే ఓ వృద్ధురాలు, ఓ ఆర్ఎంపీ చనిపోయారన్నాడు. ఆ క్షణం తమను మృత్యు భయం వెన్నాడిందని చెబుతున్నాడు.తాము వచ్చేసరికి వాగులో ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారన్నారు సహాయకసిబ్బంది. వెంటనే గజఈతగాళ్లను రంగంలోకి దింపి చాలా మందిని ఒడ్డుకు చేర్చామన్నారు.బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. గవర్నర్ బిశ్వభూషణ్ కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు మంత్రి పేర్ని నాని. గాయపడిన వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.

Exit mobile version