Police Constables Turned Kidnappers For Money In Delhi: ప్రజలకు ఏదైనా సమస్య వస్తే.. పోలీసుల్ని ఆశ్రయిస్తారు. కానీ, ఆ రక్షకులే భక్షకులు అయితే? అలాంటి సంఘటనే ఒకటి తాజాగా వెలుగు చూసింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే.. ఓ ప్రభుత్వాధికారిని కిడ్నాప్ చేశారు. అంతేకాదు.. విచక్షణారహితంగా దాడి చేసి, రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు. ఒకవేళ తాము అడిగింది ఇవ్వకపోతే.. తప్పుడు కేసులు బనాయిస్తామని బెదిరించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో జీటీబీ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న ఓ వ్యక్తి, ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో ట్యాక్స్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 11వ తేదీన సాయంత్రం తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో.. ఆయన కారుని మరో కారు అడ్డగించింది. అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి.. బలవంతంగా తమ కారులో ఎక్కించుకున్నారు. తాము క్రైమ్ బ్రాంచ్ అధికారులమని చెప్పి.. తుపాకీతో బెదిరించి, రూ. 35 వేలు లాక్కున్నారు. విడిచిపెట్టాలంటే.. రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే.. తప్పుడు కేసులు మోపి, అరెస్ట్ చేస్తామని బెదిరించారు.
ఆ తర్వాత అక్కడి నుంచి ఆ ట్యాక్స్ ఏజెంట్‌ని మరో ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ కూడా అతనిపై దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం.. అతని బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ. 50 వేలను బదిలీ చేయించుకున్నారు. తన వద్ద అంతకుమించి డబ్బులు లేవని, తనని విడిచిపెట్టమని ఎంత వేడుకున్నా వాళ్లు విడిచిపెట్టలేదు. ఎలాగైనా డబ్బులు అరేంజ్ చేయాల్సిందేనంటూ.. ఘోరంగా కొట్టారు. అప్పు తీసుకోనైనా సరే, తమకు డబ్బు ఇవ్వమని అడిగారు. దీంతో.. అతడు మరో వ్యక్తి వద్ద నుంచి రూ. 70 వేలు తీసుకొని, ఆ ముగ్గురికి ఇచ్చాడు. ఇప్పుడైనా వదిలేయమని వేడుకోగా.. ‘ఎవరికైనా ఈ విషయం చెప్తే, తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అని హెచ్చరించి వదిలేశారు. ఈ ఘటనతో భయపడిపోయిన బాధితుడు.. వెంటనే పోలీసుల్ని ఆశ్రయించాడు. కిడ్నాప్, దోపిడి కింద కేసులు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. అప్పుడు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఈ తతంగం మొత్తాన్ని అమిత్ అనే కానిస్టేబుల్ నడిపినట్లు తేలింది. మరో ఇద్దరు కూడా కానిస్టేబుళ్లేనని తేల్చారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇందులో ఓ ఎస్సై హస్తం కూడా ఉందని సమాచారం.
