Pizza delivery man shot: సాధారణంగా మనకు ఎవరైనా చిరిగిన నోటు ఇస్తే ఏం చేస్తాం.. వేరే నోటు ఇవ్వండి అని అడుగుతాం. ఇలా అడిగిన పాపానికి ఓ పిజ్జా డెలివరీ బాయ్ ప్రాణాలే అపాయంలో పడ్డాయి. చిరిగిపోయిన రూ.200 నోటు తీసుకునేందుకు నిరాకరించాడని పిజ్జా డెలివరీ బాయ్‌ని ఓ వ్యక్తి తుపాకితో కాల్చాడు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణమైన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. సచిన్ కశ్యప్(21) అనే యువకుడు పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. మరో అరగంటలో షాపు మూసేస్తారనగా.. రాత్రి 11 గంటలకు నదీమ్ ఖాన్, నయీమ్ ఖాన్ అనే ఇద్దరు సోదరులు పిజ్జా ఆర్డర్ చేశారు.
రాత్రి 11.30 గంటలకు సచిన్, అతని సహోద్యోగి రితిక్ కుమార్ ఆహారాన్ని పంపిణీ చేసి, డబ్బు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సహోద్యోగులు తమకు చెల్లించిన రూ.200 నోటుతో శీతల పానీయం కొనుగోలు చేసేందుకు వెళ్లారు. అయితే, అది చిరిగిపోయిందని దుకాణదారు చెప్పడంతో వేరే నోటు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇద్దరూ వెంటనే వెనక్కి వెళ్లి, నదీమ్ తలుపు తట్టి, నోటును మార్చమని నదీమ్‌ను అభ్యర్థించారు. అయితే ఆగ్రహించిన నదీమ్ వారిపై దుర్భాషలాడాడు. వెంటనే అతని సోదరుడు బయటకు వచ్చి నాటు తుపాకీతో సచిన్‌పై కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడు సచిన్ కశ్యప్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు, అక్కడి నుంచి బరేలీలోని ప్రత్యేక వైద్య కేంద్రానికి తరలించారు.
High Court of Telangana : బీజేపీ సభకు ఆంక్షలతో కూడిన అనుమతి
రంగంలోకి దిగిన పోలీసులు నదీమ్, నయీమ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి ఇంటి నుంచి రెండు నాటు తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సచిన్ పరిస్థితి విషమంగా ఉందని, నదీమ్ సోదరులపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని అధికారులు వెల్లడించారు. నిందితులు నదీమ్ ఖాన్ (27), అతని సోదరుడు నయీమ్ (29)పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సదర్ బజార్ ఎస్‌హెచ్‌ఓ అమిత్ పాండే తెలిపారు.