Site icon NTV Telugu

Nizamabad Cybercrime Scam: లైఫ్ సెటిల్ అయిపోతుందని ఆశ పడతారు.. కానీ!

Nizamabad Cybercrime Scam

Nizamabad Cybercrime Scam

Nizamabad Cybercrime Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరిట కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయి. అమాయకులైన నిరుద్యోగలకు ఆశలు కల్పించి.. విదేశాలకు తీసుకువెళ్లి.. అక్కడ సైబర్ నేరాలు చేయిస్తున్నాయి కొన్ని ముఠాలు. అలాంటి ఓ ముఠా గుట్టు రట్టు చేశారు నిజామాబాద్ పోలీసులు. నిరుద్యోగులకు కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల పేరుతో ఎరవేసి.. వారితో విదేశాల్లో సైబర్ నేరాలు చేయిస్తున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. సైబర్ నేరాలపై రాష్ట్రంలోనే తొలి పీడీ యాక్ట్ ప్రయోగించారు.

READ ALSO: OG : పవన్ కల్యాణ్‌ పాడిన సాంగ్ రిలీజ్..

విదేశాల్లో ఉద్యోగం, లక్షణమైన జీతం.. ఇలా చెబితే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. హమ్మయ్య.. ఇక లైఫ్ సెటిల్ అయిపోతుందని ఆశ పడతారు.. సరిగ్గా ఇలా ఆలోచించే వారినే టార్గెట్ చేస్తున్నాయి కొన్ని ముఠాలు. ఉద్యోగం మోజులో పడి అమాయక యువతీ యువకులు నకిలీ ఏజెంట్ల చేతికి చిక్కి విలవిలలాడుతున్నారు. అలాంటి ఓ ముఠా వలలో పడ్డ నిరుద్యోగ యువత.. మయన్మార్, లావోస్, కంబోడియా దేశాలకు వెళ్లి సైబర్ నేరగాళ్ల ముఠాకు చిక్కారు. మంచి జీతం, ఉచిత వసతి, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం అంటూ దళారుల మాటలు నమ్మి.. అక్కడికి వెళితే.. బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారు. ఈ తరహాలో బలైన నిజామాబాద్, నందిపేట, కుర్నాపల్లికి చెందిన యువకులు ఆ ముఠా ఉచ్చులోంచి ఎలాగోలా తప్పించుకుని స్వదేశానికి చేరుకున్నారు. బంధువుల సహాయంతో పోలీసులను ఆశ్రయించారు..

ప్రధాన నిందితుడు నాగశివ అరెస్ట్
ఈ కేసును సీరియస్‌గా తీసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ఆయా ఘటనలపై 3 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రధాన నిందితుడు నాగశివను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. నిందితునిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సైబర్ నేరాల్లో నిందితునిపై పీడీ యాక్ట్ అమలు చేయడం రాష్ట్రంలోనే తొలి కేసుగా పోలీసులు చెబుతున్నారు. నాగశివ బాధితులు ఉంటే పోలీసులను సంప్రదించాలని నిజామాబాద్ పోలీసులు కోరారు…

ఈ కేసుపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు చెందిన కొలనాటి నాగశివ.. గతంలో ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి మోసపోయాడు. ఆ సమయంలో పరిచయమైన కొందరు విదేశీయులతో చేతులు కలిపి ఓ ముఠా ఏర్పాటు చేశాడు. తెలుగు ప్రాంతాల యువతకు విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయంటూ ఎరవేశాడు. విదేశీ ఉద్యోగం మోజులో కొందరు నిరుద్యోగులు నాగశివ మాటలు నమ్మి లక్షల్లో చెల్లించారు. విదేశాల్లో ఉద్యోగం అంటూ వెళ్లిన నిరుద్యోగులను నకిలీ ఏజెంట్ల సాయంతో బ్యాంకాక్ మీదుగా లావోస్, కంబోడియా, పిలిప్పీన్స్, మయన్మార్ తదితర దేశాలకు పంపించాడు. అక్కడ రహస్య క్యాంపుల్లో బంధించి.. పాస్ పోర్టులు లాక్కుని బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని చెప్పారు.

తెలంగాణ వ్యాప్తంగా బాధితులు పెద్ద సంఖ్యలో ఉండగా.. నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించడంతో.. ఈ ముఠా దందా బయటపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. నాగశివను విదేశాల నుంచి రప్పించి.. పీడీయాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సైబర్ నేరాలపై నిజామాబాద్ జిల్లాలో నమోదైన తొలి కేసుగా పోలీసులు చెబుతున్నారు. విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని ఎవరైనా చెబితే.. ఆ కంపెనీ నిజమైందో, నకిలీదో తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తన్నారు.. విదేశాల్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు గాలం వేసే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటు పోలీసులు ఇలాంటి నేరాలపై మరింత చైతన్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు..

READ ALSO: 1965 India Pakistan War: 1965 యుద్ధంలో పాక్ ఓటమి వెనుక అసలైన కారణాలు బయటపెట్టిన వీర్ చక్ర అవార్డు గ్రహీత..

Exit mobile version