రోజురోజుకు ఆన్ లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. ఒకపక్క సైబర్ నేరగాళ్లు ఒకలా డబ్బు గుంజుతుంటే.. మరోపక్క కొంత మంది హానీ ట్రాప్ పేరుతో డబ్బులను గుంజుతున్నారు. ఆన్ లైన్ లో అమ్మాయిల పేరుతో మగాళ్లకు వాలా విసిరి, వారిని ప్రేమ మత్తులో ముంచి, వారి నగ్న వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా న్యూ ఢిల్లీలో ఇలాంటి ఘటన సంచలనం రేపుతోంది. డేటింగ్ యాప్ ద్వారా పురుషులను రెచ్చగొట్టి, వారిని ఇంటికి పిలిచాకా బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
వివరాలలోకి వెళితే.. ఢిల్లీలో వ్యాపారం చేస్తున్న ఒక వ్యాపారవేత్తకు ఇటీవల ఒక మహిళ కాల్ చేసింది. ప్లై బోర్డు కావాలని ఆమె కోరడంతో అతను దాని తీసుకొని ఆమె ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతడికి మహిళ మంచి నీళ్లు ఇచ్చింది. నీళ్లు తాగిన కొద్దిసేపటికే అతను స్పృహ కోల్పోయాడు. తిరిగి లేచి చూసేసరికి నగ్నంగా బెడ్ పై పడి ఉండడం గమనించాడు. చుట్టూ ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు అతడిపై దాడి చేసి అతడి వద్ద ఉన్న నగదును, నగలను లాక్కున్నారు. అంతేకాకుండా మరి కొంత డబ్బు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ విషయం ఎవరికైనా చెప్పినా , డబ్బు ఇవ్వకపోయినా అతడి నగ్న వీడియోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ముఠా ఇప్పటికే 40 మందిని డేటింగ్ యాప్ ద్వారా మోసం చేశారని, మహిళల చేత కాల్స్ చేయించి, వారిని ఇంటికి రప్పించి, మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చి, వారి నగ్న వీడియోలను తీస్తారని, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారని తెలిపారు. నిందితుల నుంచి కొన్ని ఫైళ్లు, డబ్బు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు.
