Mumbai Police Chase Headless Body Case After One Year: గతేడాది మహారాష్ట్రలో సంచలన సృష్టించిన ఒక హత్య కేసుని పోలీసులు చేధించారు. ఒక బీచ్ వద్ద సూట్‌కేసులో లభ్యమైన మొండెం లేని మృతదేహం ఎవరిదన్న విషయం దాదాపు 13 నెలల తర్వాత వెలుగులోకి రావడంతో, కేసు దర్యాప్తుని వేగవంతం చేసి నిందితుడ్ని పట్టుకోగలిగారు. ఇంతకి ఆమెని అంత కిరాతకంగా ఎవరు హత్య చేసి ఉంటారని అనుకుంటున్నారా? మరెవ్వరో కాదు.. ఆమె భర్తే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
గతేడాది జులై 26వ తేదీన పోలీసులకు భువిగావ్ బీచ్ వద్ద ఒక సూట్‌కేసులో ఒక మొండెం లేని మృతదేహం లభ్యమైంది. అప్పుడే హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. తొలుత ఆ మృతదేహం ఎవరిదో కనుగొనడం మొదలుపెట్టారు. పల్గార్ జిల్లాతో పాటు ముంబైలోని అన్ని పోలీస్ స్టేషన్‌లలో నమోదైన మిస్సింగ్ కేసుల రిపోర్టులను తిరగేశారు. చివరికి గుజరాత్ బార్డర్‌లో కూడా విచారించారు. కానీ, ఎక్కడ ఆ మృతదేహానికి మ్యాచ్ అయ్యే రిపోర్ట్ దొరకలేదు. పోస్టర్లు అతికించినా ప్రయోజనం లేకుండా పోవడంతో.. ఇక ఈ కేసుని పక్కన పెట్టేయాలని పోలీసులు అనుకున్నారు.
అయితే.. ఈ ఏడాది ఆగస్టు 30వ తేదీన ఆ మొండెం లేని మృతదేహానికి మ్యాచ్ అయ్యే ఒక మిస్సింగ్ రిపోర్ట్ పోలీసుల వద్దకు వచ్చింది. అప్పుడు ఆమె పేరు సానియా షేక్ (25) అని తెలిసింది. ఆమె బంధువులు నాలాసోపారలోని అచోల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేశారు. తమ ఫోన్ కాల్స్‌కు ఆమె భర్త సమాధానం ఇవ్వకపోవడంతో, అనుమానం వచ్చి వాళ్లు ఈ కేసు నమోదు చేశారు. ఆ రిపోర్ట్ ఆధారంగా వెంటనే విచారణ మొదలుపెట్టిన పోలీసులు.. భర్త ఆసిఫ్ షేక్ ఆమెని హతమార్చినట్టు నిగ్గు తేల్చారు. దీంతో అతడ్ని అరెస్ట్ చేశారు.
ఇంతకీ ఎందుకు చంపాడో తెలుసా? కేవలం అనుమానం రావడంతో! తన భార్య మరొకరితో సన్నిహితంగా ఉందేమోనని భర్త అనుమానం పెంచుకుంటూ వచ్చాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. చివరికి ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని.. భార్యని హతమార్చాడు ఆసిఫ్. అనంతరం శరీరం నుంచి ఆమె తలని వేరు చేసి, ఎవరికీ అనుమానం రాకుండా సూట్‌కేసులో మృతదేహం వేసి, భువిగావ్ బీచ్ వద్ద వదిలేశాడు. మరొకరితో భార్య పారిపోయిందని నమ్మించేందుకు, అతడు ఒక నకిలీ లేఖ కూడా రాసిపెట్టాడు. కానీ, అతడి ఆటలు సాగలేదు.
