అహ్మదాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి లోకల్‌గా ఉండే అల్లరిమూకలు రెచ్చిపోయారు. వందలాది మంది గుంపులు.. గుంపులు వచ్చి ఇష్టానురీతిగా వాహనాలు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనతో గజగజలాడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జునా వాడాజ్ ప్రాంతంలోని రామ్ కాలనీలో శుక్రవారం రాత్రి దాదాపు 100 మందికి పైగా గుంపులు చొరబడి కర్రలు, రోడ్లు, కత్తులతో వాహనాలను ధ్వంసం చేశారు. బైకులు, కార్లపై వచ్చి ఈ విధ్వంసానికి పూనుకున్నారు. అంతేకాకుండా సిక్కు ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. కంటికి కనిపించిన వస్తువులను ధ్వంసం చేశారు.
ఇదిలా ఉంటే సొసైటీలో గొడవలు సృష్టించొద్దని సిక్కు సమాజానికి చెందిన కొందరు భర్వాద్ కమ్యూనిటీ ప్రజలను కోరారు. ఈ మాట వారికి అభ్యంతరం అయింది. నెల రోజుల్లోనే గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి మనసులో పగ పెట్టుకుని.. అర్ధరాత్రి వచ్చి నానా హంగామా సృష్టించి వాహనాలు పాడు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనాస్థిలికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డైన నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ఉద్రిక్తతలు పెరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.