ప్రమాదవశాత్తు మహీంద్రా థార్ కారు రైల్వే ట్రాక్‌పైకి వెళ్లిన ఘటన నాగాలాండ్ రాష్ట్రంలోని దిమాపూర్‌లో చోటుచేసుకుంది. దిమాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ కారును 65 ఏళ్ల వృద్ధుడు నడిపించాడని సమాచారం. స్థానికులు ఈ ఘటనను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వేగంగా వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే, మహీంద్రా థార్ కారు స్టేషన్‌లోని MXN వైపు నుంచి రైల్వే పట్టాలపైకి ప్రవేశించి దిమాపూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ ప్రాంతం వైపు కదిలినట్లు సమాచారం. అయితే వాహనం మరింత ముందుకు వెళ్లకుండానే బర్మా క్యాంప్ వైపు ఉన్న పాత ఫ్లైఓవర్ సమీపంలో రైల్వే పట్టాలపై ఇరుక్కుపోయింది. ఈ కారును నడిపిస్తున్న వ్యక్తిని 65 ఏళ్ల థెప్ఫునిటువోగా రైల్వే అధికారులు గుర్తించారు.
సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కారు రైల్వే ట్రాక్‌పై నిలిచిపోవడంతో కొంతసేపు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ డ్రైవర్ వాహనాన్ని రైల్వే ట్రాక్‌లపైకి నడిపాడని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో రైలు వచ్చి ఉంటే తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అనంతరం వాహనాన్ని సురక్షితంగా ట్రాక్‌ల నుంచి తొలగించి, రైల్వే ఆస్తి, డ్రైవర్‌తో పాటు ప్రజల భద్రతను అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై ప్రస్తుతం అధికారులు విచారణ చేపట్టారు.
