AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం

Ap And Tg Crime

Ap And Tg Crime

AP and TG Crime: హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ మాదాపూర్‌లోని ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో అనుమానితుడిగా ఉన్న యువకుడు ఆసుపత్రి నుంచి పరారై తన స్వగ్రామానికి చేరుకున్న అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడు విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ పరిణామంతో మాదాపూర్ పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.

విశాఖపట్నానికి చెందిన షారోన్‌ నిఖితా టోప్నో, అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఇ-మర్రిపాలెంకు చెందిన శ్రీనివాస రవితేజకు కొంతకాలంగా పరిచయం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 21న వీరిద్దరూ మాదాపూర్‌ సిద్ధిఖీ నగర్‌లోని ఓయో హోటల్‌లో రూమ్‌ నంబర్‌ 303లో బస చేశారు. మంగళవారం తెల్లవారుజామున నిఖిత అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో రవితేజ హోటల్‌ సిబ్బంది సహాయంతో ఆమెను కొండాపూర్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువతి మృతి విషయం తెలిసిన వెంటనే రవితేజ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాడు. దీంతో మాదాపూర్ పోలీసులు అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. హోటల్‌ గదిని పరిశీలించిన క్లూస్‌ టీమ్‌కు గోడలు, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు కనిపించాయి. యువతి ముఖం, తల భాగంలో గాయాలు, వాపులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గదిలో ఖాళీ బీర్‌, విస్కీ బాటిళ్లు కూడా లభించడంతో అక్కడ ఏం జరిగిందన్న దానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు హైదరాబాద్‌ నుంచి పరారైన రవితేజ తన స్వగ్రామానికి చేరుకున్నాడు. బుధవారం ఇంట్లో ఫ్లోర్‌ క్లీనింగ్‌ లిక్విడ్‌ తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు అతడిని తొలుత అగనంపూడి ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని పరవాడ పోలీసులు మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. రవితేజ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు మాదాపూర్ పోలీసుల ప్రత్యేక బృందం విశాఖకు వెళ్లినట్లు సమాచారం. హోటల్‌ సీసీటీవీ ఫుటేజీ, ఫోరెన్సిక్‌ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. యువతి మృతికి అసలు కారణం, గాయాలు ఎలా సంభవించాయన్నది పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ నివేదికలు వచ్చిన తర్వాత మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.