గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత తొమ్మిదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా భారీ ఎత్తున గంజాయి దందా సాగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును నార్కోటిక్స్ పోలీసులు రట్టు చేశారు. వరుస మాదకద్రవ్యాల నేరాలకు పాల్పడుతున్న నానక్‌రామ్‌గూడకు చెందిన కాలాపతి నీతూ బాయి (51)ని హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, తెలంగాణ ‘ఈగల్’ (EAGLE) ఫోర్స్ టెక్నికల్ బృందం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అరెస్ట్ చేశాయి. నిందితురాలిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఆమె అరెస్ట్ సమయంలో రూ.1,59,500 నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఐటీ ఉద్యోగులు, విద్యార్థులే లక్ష్యంగా దందా
2017 నుంచి నిందితురాలు గంజాయి అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను నడుపుతోంది. హోల్‌సేల్ వ్యాపారుల నుంచి పెద్దమొత్తంలో గంజాయిని కొనుగోలు చేసి, చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి నానక్‌రామ్‌గూడ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, హాస్టళ్లు, అద్దె ఇళ్లలో ఉండే విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని ఈ అక్రమ వ్యాపారాన్ని విస్తరించింది. గడిచిన రెండేళ్లలోనే గచ్చిబౌలి, ఈగల్ ఫోర్స్, ఎక్సైజ్ విభాగాల పరిధిలో ఆమెపై 12 కేసులు నమోదయ్యాయి. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు నానక్‌రామ్‌గూడలోని తన ఇంట్లో ఉండకుండా గచ్చిబౌలి, లంగర్‌హౌజ్ ప్రాంతాల్లో నిరంతరం స్థావరాలు మారుస్తూ తలదాచుకుంటోంది.
కుటుంబమే ఓ డ్రగ్ సిండికేట్ – 30 కేసులు నమోదు
నిందితురాలు నీతూ బాయి, ఆమె కుటుంబ సభ్యులపై 2017 నుంచి ఇప్పటివరకు ఎన్డీపీఎస్ (NDPS), ఎక్సైజ్ చట్టాల కింద దాదాపు 30 కేసులు నమోదయ్యాయి. శేరిలింగంపల్లి, ధూల్‌పేట్, నారాయణగూడ, గోల్కొండ, గచ్చిబౌలి, సైబరాబాద్ నార్కోటిక్స్ ఠాణాల్లో ఈ కేసులు ఉన్నాయి. వీటిలో 13 కేసుల్లో ఆమె పరారీలో ఉంది. గతంలో పలుమార్లు జైలుకు వెళ్లినప్పటికీ, బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ అదే వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ఈ దందాలో ఆమె కుటుంబ సభ్యులు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు.
ఆగస్టు 2023: గోల్కొండ పోలీసులు స్కార్పియో వాహనంలో 22 కిలోల గంజాయిని తరలిస్తున్న ఆమె కుమారుడిని అరెస్ట్ చేశారు. వారి ఆస్తులపై జరిపిన సోదాల్లో దాదాపు రూ.40 లక్షల నగదు పట్టుబడింది.
అక్టోబర్ 2023: గచ్చిబౌలి పోలీసులు జరిపిన దాడిలో 7.5 కిలోల గంజాయి, రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
మార్చి 2024: గచ్చిబౌలి పోలీసులు చేపట్టిన మరో ఆపరేషన్‌లో 22 కిలోల గంజాయి, రూ.22 లక్షల నగదు పట్టుబడటంతో పాటు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు.
గంజాయి సొమ్ముతో భారీగా ఆస్తులు.. దర్యాప్తు ముమ్మరం
గంజాయి విక్రయాల ద్వారా సంపాదించిన అక్రమ సొమ్ముతో భారీగా స్థిర, చరాస్తులు కూడబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. లంగర్‌హౌజ్‌లో రెండు జీ+3 భవనాలు, గచ్చిబౌలిలో ఒక జీ+2 భవనం, నానక్‌రామ్‌గూడలోని నివాసంలో అదనపు నిర్మాణాలను గుర్తించారు. గతంలోనే నిందితురాలు, కుటుంబ సభ్యులతో పాటు వారు నడుపుతున్న ‘జయలక్ష్మి కిరాణా అండ్ జనరల్ స్టోర్’ బ్యాంకు ఖాతాలను పోలీసులు స్తంభింపజేశారు (ఫ్రీజ్). ప్రస్తుతం ఈ అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ పత్రాలు, నిధుల మూలాలపై పూర్తిస్థాయి ఆర్థిక విచారణ జరుపుతున్నారు.
మొబైల్ వాడకుండా తప్పించుకుంటూ.. చివరకు ఇలా చిక్కింది!
జూన్ 2026లో సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు నానక్‌రామ్‌గూడలోని ఆమె ఇంటిపై దాడి చేసి, గంజాయి విక్రయాల సొమ్ము రూ.2.60 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడ నిఘా పెట్టి, గంజాయి కొనుగోలుకు వచ్చిన దాదాపు 50 మంది వినియోగదారులను పట్టుకుని వారిపై కేసులు నమోదు చేశారు. పోలీసుల కళ్లుగప్పేందుకు నిందితురాలు మొబైల్ ఫోన్ వాడటం మానేసి, తరచూ ప్రదేశాలు మారుస్తూ తప్పించుకు తిరుగుతోంది. తెలంగాణ ‘ఈగల్’ ఫోర్స్ టెక్నికల్ బృందం ప్రత్యేక నిఘా, సమాచార నెట్వర్క్ ద్వారా ఆమె కదలికలను పసిగట్టింది. ఆటోరిక్షాలో మంగళ్‌హాట్ వైపు వెళ్తుండగా వలపన్ని అరెస్ట్ చేసింది.

