కేరళలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. సైబర్ నేరగాళ్లు ఈ సారి పోలీసులనే టార్గెట్ చేశారు. పోలీసులను మోసం చేసేందుకు జిల్లా పోలీస్ అధికారి ప్రథీప్ టి.కే. పేరుతో నకిలీ వాట్సాప్ అకౌంట్ ను ఏర్పాటు చేసి.. పోలీసుల నుంచే డబ్బులు అడిగేందుకు యత్నించాడు. దీనికి సంబంధించి జిల్లాలోని కొందరు అధికారులకు వాట్సాప్ నెంబర్ నుంచి మెసేజ్ లు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇందులో ఓ ఉన్నతాధికారి ఫోటోను ప్రొఫైల్ ఫిక్ గా పెట్టి.. వేరే వారి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించారు.
తనకు అర్జెంట్ గా 40వేల రూపాయలు కావాలని.. డబ్బులు పంపాలని సదరు అధికారి పేరుతో సైబర్ మోసగాళ్లు .. కింది స్థాయి అధికారులకు మెసేజ్ పంపించారు. ఇది గమనించిన అధికారులు డబ్బులు పంపకుండా ఉన్నతాధికారులకు వెల్లడించారు. ఇలాంటి సైబర్ నేరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
కొందరు కేటుగాళ్లు పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులమని వాట్సాప్ ద్వారా నమ్మిస్తూ.. డబ్బులు అడుగుతున్నారు. కొన్ని ప్రైవేట్ కంపెనీల మేనేజర్లు తమ ఎండీ పేరుతో వచ్చిన మేసేజ్ నమ్మి జేబులు ఖాళీ చేసుకున్న ఘటన కేరళలో జరిగాయి.
వాట్సాప్ ద్వారా లేదా ఫోన్ ద్వారా ఎవరైనా మోసాలకు పాల్పడితే.. ఫస్ట్ వారి ఐడీని గుర్తించాలంటున్నారు పోలీసులు. వారికి డబ్బులు పంపకుండా.. కాల్ చేయడం ద్వారా నిజం తెలుసుకోవాలన్నారు.
మేం ఎమర్జెన్సీలో ఉన్నాం అంటూ హడావిడి చేస్తే.. ఖచ్చితంగా అతడిని మోసగాడిగా గుర్తించాలని వెల్లడించారు పోలీసులు.
