Ganja Murders: మత్తులో మృగాళ్లు.. భాగ్యనగరంలో గంజాయి బ్యాచ్‌ల వీరంగం.. రెండు రోజుల్లో ఇద్దరి బలి!

Ganja Murders

Ganja Murders

Ganja Murders: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరుతున్నాయి. నిన్న మొన్నటిదాకా గంజాయి మత్తులో గల్లీలో వీరంగం సృష్టించిన పోకిరీలు.. ఇప్పుడు ఏకంగా హత్యలకు తెగబడుతున్నారు. కలిసి గంజాయి కొట్టిన స్నేహితుడిని హత్య చేస్తున్న బ్యాచ్‌లు కొన్ని అయితే.. గంజాయి కొడుతుండగా అడ్డుకున్న వారిపై దాడి చేసి మారుస్తున్న బ్యాచ్‌లు మరికొన్ని. హైదరాబాద్ నగరంలో రెండు రోజుల వ్యవధిలోనే రెండు హత్యలు ఈ గంజాయి కారణంగానే జరగడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. బంజారాహిల్స్‌లో గంజాయి మత్తులో స్నేహితుడిని కొట్టి చంపిన ఘటన ఒకటైతే.. సంతోష్‌నగర్‌లో వ్యక్తిగత తగాదాలతో హత్యకు దారి తీసిన మరో ఘటన మరొకటి. రెండు హత్యలకు కారణం.. గంజాయే కావడం విశేషం..

READ ALSO: Markapur: కుటుంబ కలహం.. మామను చంపిన అల్లుడు..

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పదో తరగతి చదువుతున్న అక్షయ్ కుమార్.. గంజాయికి బానిసయ్యాడు. స్థానికంగా ఉన్న ఓ పార్కులో అక్షయ్ కుమార్ గంజాయి సేవిస్తుండగా.. అతని స్నేహితుడు రఘువీర్ అడ్డుకున్నాడు. ఇంత చిన్న వయసులో గంజాయి తాగొద్దురా.. ఆరోగ్యానికి ప్రమాదకరం అని సలహా ఇచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తి.. గొడవగా మారింది. ఇప్పటికే గంజాయి మత్తులో ఉన్న అక్షయ్ ఒక్కసారిగా.. రఘువీర్‌పై దాడి చేశాడు. తలపై బలంగా కొట్టడంతో.. రఘువీర్ కింద పడిపోయాడు. అదే సమయంలో రఘువీర్‌కి ఫిట్స్ వచ్చింది. కాసేపటికి రఘువీర్ స్పాట్‌లోనే చనిపోయాడు. ఘటన సమయంలో అక్కడ మరో ముగ్గురు యువకులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. ఈ నలుగురిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు సమాచారం.

రెండు రోజుల వ్యవధిలోనే సంతోష్‌నగర్ పరిధిలో మరో హత్య సంచలనం సృష్టించింది. మోయిన్‌బాగ్ నాలా సమీపంలో సయ్యద్ లయీక్‌ దారుణ హత్యకు గురయ్యాడు. సయ్యద్ లయీక్‌కి పరిచయం ఉన్న వ్యక్తే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత విభేదాల కారణంగా సయ్యద్‌ను హతమార్చినట్టు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. హత్యకి పాల్పడ్డ నిందితుడు.. గంజాయి మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి మత్తులో ఉండడం కారణంగానే.. చిన్న గొడవ కూడా పెద్దగా అనిపించి.. స్నేహితుడైన సయ్యద్ లయీక్‌ను హత్య చేశాడు నిందితుడు. నగరంలో జరుగుతున్న వరుస హత్యలు.. దాడులు.. గ్యాంగ్ వార్‌ల.. వంటి ఘటనలకు కారణం గంజాయి అవడంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ప్రతి ఏరియాలో ఉండే గంజాయి బ్యాచ్‌లపై నిఘా పెట్టారు. మున్సిపల్ గ్రౌండ్‌లు, పబ్లిక్ పార్కులు.. నిర్మానుష్య ప్రదేశాలలో ప్రత్యేక టీమ్‌లతో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. గతంలో గంజాయి కేసుల్లో బుక్ అయిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు.

READ ALSO: Ragi Chapati: షుగర్‌కు చెక్.. బరువు తగ్గడానికి బెస్ట్ మంత్రం.. ఈ స్టైల్‌లో రాగి చపాతీ తింటే ఫలితం పక్కా!