NTV Telugu Site icon

Hyderabad Investment Fraud: 900 కోట్ల హవాలా రాకెట్ గుట్టు రట్టు.. 12 మంది అరెస్ట్

Investment Fraud Hyderabad

Investment Fraud Hyderabad

Hyderabad Cyber Crime Police Bust Investment Hawala Racket: ఏదైనా ఒక బిజినెస్‌లో మంచి లాభాలు వస్తాయని తెలిస్తే.. పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రారు చెప్పండి? దీన్నే ఒక ముఠా ఆసరాగా చేసుకొని.. ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో హవాలా రాకెట్ నడిపింది. ఏకంగా రూ. 900 కోట్ల ఫ్రాడ్‌కి పాల్పడింది. కానీ.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఈ ముఠా గురించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందగా, వెంటనే రంగంలోకి దిగింది. తమదైన శైలిలో విచారణ చేపట్టి.. ఈ 900 కోట్ల హవాలా స్కామ్‌ని బట్టబయలు చేసింది. ఈ కేసులో మొత్తం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో నలుగురు చైనా దేశస్తులు, ఐదుగురు ఢిల్లీ వాసులు, ముగ్గురు హైదరాబాద్‌కి చెందిన వాళ్లు ఉన్నారు. పెట్టుబడుల పేరుతో మొత్తం రూ. 900 కోట్లు వసూలు చేసిన ఈ ముఠా.. ఆ డబ్బుని విదేశాలకు తరలించేశారు. దేశవ్యాప్తంగా చాలామంది నుంచి వాళ్లు ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో దోచేసినట్టు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసిన 12 మందిని రిమాండ్‌కు తరలించిన అధికారులు, వారి వద్ద నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

అటు.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అతిపెద్ద హవాలా రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. ట్రావెల్స్ బస్సుల ద్వారా హవాలా సొమ్ము, బంగారం రవాణా చేస్తున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు.. ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో భారీ మొత్తం పట్టుబడింది. తూర్పు గోదావరి జిల్లా కృష్ణవరం టోల్‌ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించగా.. ట్రావెల్స్‌ బస్సుల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.5.6 కోట్ల నగదు, 10 కేజీల బంగారాన్ని సీజ్‌ చేశారు. అలాగే.. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ ప్లాజా వద్ద ప్రైవేట్‌ బస్సులో రూ.4.76 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా మూడు బస్సులను సీజ్ చేశారు. ఈ హవాలా లావాదేవీలకు పద్మావతి ట్రావెల్స్ బస్సులను అక్రమార్కులు వినియోగించుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర, బెజవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన బంగారం వర్తకుల మధ్య ఈ హవాలా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు.