ఖతర్నాక్ కోడలు..!

Crime News (1)

Crime News (1)

HYD KHATARNAK KODALU: అత్తలేని కోడలు ఉత్తమురాలు.. కోడలు లేని అత్త గుణవంతురాలు.. అంటూంటారు. మరి అత్తకు కోడలు.. కోడలికి అత్త ఉంటే.. నిత్యం ఇంట్లో వార్ తప్పదా? ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ హైదరాబాద్ చిలకలగూడలో ఓ ఘటన జరిగింది. అత్తపై నిలువెల్లా రగిలిపోయిన కోడలు..దాడి చేసి చంపేయాలని చూసింది. కానీ చుట్టుపక్కల వారు కలగజేసుకోవడంతో ఆమె సురక్షితంగా బయటపడింది. చిలకలగూడ పరిధిలోని యెరుకల బస్తీలో నివాసముంటున్న పద్మావతి అనే వృద్ధురాలికి, ఆమె కోడలు విజయలక్ష్మికి మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. జులై 22న కూడా అదే జరిగింది. వారిద్దరి మధ్య మాటమాట పెరిగి వివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన కోడలు విజయలక్ష్మి.. వంటింట్లో ఉన్న పదునైన కత్తితో అత్త పద్మావతిపై ఒక్కసారిగా దాడి చేసింది. విజయలక్ష్మి విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో పద్మావతికి తీవ్ర గాయాలయ్యాయి..

అత్తను కత్తితో పొడవడమే కాకుండా.. జుట్టు పట్టుకుని ఇంట్లో నుంచి ఈడ్చుకుని బయటకు తీసుకు వచ్చింది. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ క్రమంలో ఆత్త గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల నివసిస్తున్న స్థానికులు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వృద్ధురాలిని చూసి షాక్‌కు గురైన పొరుగువారు, వెంటనే ఆమెను రక్షించి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో పద్మావతి చికిత్స పొందుతోంది.

చిలకలగూడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించిన అనంతరం, బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు నిందితురాలు విజయలక్ష్మిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోడలు అంతటి దారుణమైన చర్యకు ఒడిగట్టడానికి గల అసలు కారణాలు, కుటుంబంలో చోటుచేసుకున్న అంతర్గత వివాదాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు.