కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని నెహ్రూ చౌక్ సెంటర్‌లో ఉన్న వాణిజ్య దుకాణాల సముదాయంలో ఈ ప్రమాదం సంభవించింది. కాంప్లెక్స్‌లోని వస్త్ర దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, భారీ అగ్నికీలలు ఎగసిపడడంతో పరిసర ప్రాంతాలు ఉలిక్కిపడ్డాయి. ఈ ఘటనలో కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
అదే కాంప్లెక్స్‌లో ఒక జూనియర్ కళాశాలతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కార్యాలయం కూడా ఉండటంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే, మంటలు అదుపులోకి రాకుండా వేగంగా ఇతర దుకాణాలకు వ్యాపించాయి. దీంతో కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుని, స్థానికులు భయాందోళనకు గురై రోడ్లపైకి పరుగులు తీశారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఇతర ప్రాంతాల నుంచి అదనపు అగ్నిమాపక బృందాలను కూడా రప్పించారు.
అగ్నిప్రమాదం జరిగిన కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న దుకాణదారులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మొదటగా కాంప్లెక్స్‌లోని ఒక సెల్‌ఫోన్ దుకాణం నుంచి మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడం ఊరటనిచ్చే విషయం అని అధికారులు తెలిపారు.
