హైదరాబాద్‌లోని శంషాబాద్ జోన్ పరిధిలో నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులను తయారు చేస్తున్న ఒక అక్రమ ముఠా గుట్టును హైదరాబాద్ నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరిగే పనిలేకుండా, కొంత డబ్బు ఇస్తే చాలు కోరుకున్న పేరు, పుట్టిన తేదీ, చిరునామాలను క్షణాల్లో మార్చి నకిలీ కార్డులు అందిస్తున్నట్లు గుర్తించారు. శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, పహాడీషరీఫ్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఈ దందాకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి శ్రీరామ్ కాలనీకి చెందిన సిహెచ్. మహాదేవ్ (36) ఏడో తరగతి వరకు చదువుకుని, బుధ్వేల్‌లోని శ్రీరామ్ నగర్ కాలనీలో “కవిత ఎ టు జెడ్ ఆన్‌లైన్ సర్వీసెస్” పేరిట జిరాక్స్ సెంటర్ నడిపిస్తున్నాడు. ఆ వ్యాపారంలో సరిపడా ఆదాయం రాకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఫోర్జరీకి తెరలేపాడు. ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ల సాయంతో తన నివాసంలోనే రహస్యంగా కస్టమర్ల వివరాలకు అనుగుణంగా ఆధార్, పాన్ కార్డులలో పేర్లు, ఫొటోలు, పుట్టిన తేదీలు, చిరునామాలను సవరించేవాడు. పుట్టిన తేదీ మార్పుకు రూ.300, పూర్తి వివరాలు మార్చడానికి రూ.700 నుంచి రూ.1,000 వరకు వసూలు చేసేవాడు.
ఈ నకిలీ కార్డులను ప్రైవేట్ ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు పొందడానికి, మొబైల్ సిమ్ కార్డులు తీసుకోవడానికి, ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం ప్రజలు వినియోగిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్, పహాడీషరీఫ్ పోలీసులు అతడి నివాసంపై దాడి చేసి మహాదేవ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 60 నకిలీ ఆధార్ కార్డులు, 2 పాన్ కార్డులు, రూ.5,000 నగదుతో పాటు నేరానికి ఉపయోగించిన ల్యాప్‌టాప్, ప్రింటర్, లామినేషన్ మెషిన్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ నకిలీ కార్డులు పొందిన వారిపై, వారి ద్వారా జరిగిన ఇతర మోసాలపై పోలీసులు ప్రస్తుతం విస్తృత దర్యాప్తు చేస్తున్నారు.

