Chennai Police Busted Drugs Racket In Tamilnadu: ఇటీవల చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడటం, రాష్ట్రంలోనూ డ్రగ్స్ రవాణా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో.. చెన్నై పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. డ్రగ్స్ రాకెట్‌ను గుట్టు రట్టు చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ మొదలుపెట్టిన పోలీసులు.. ఇందులో సక్సెస్ అయ్యారు. భారీ డ్రగ్స్ రాకెట్‌ని చేధించారు.
స్ధానిక వాషర్‌మెన్ పేటలోని ఎంబీడీ కాలనీ సమీపంలో.. డ్రగ్స్ తయారు చేస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో, పక్కా స్కెచ్ వేసిన పోలీసులు, ఆ ప్రదేశంపై దాడులు చేశారు. డ్రగ్స్ తయారు చేస్తుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా నిందితుల్ని పట్టుకున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే.. తెలంగాణకు చెందిన ప్రముఖ డ్రగ్ డీలర్ రమేశ్ సైతం పట్టుబట్టాడు. ఇతడు తెలంగాణలో పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేసే డీలర్‌గా తేలింది. రమేశ్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన పయస్ అజ్మత్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో 15 లక్షలు విలువ చేసే డ్రగ్స్ తయారు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలావుండగా.. జులై 14వ తేదీన చెన్నై ఎయిర్‌పోర్టులో దాదాపు రూ. 9 కోట్లు విలువ చేసే 1.26 కేజీల హెరాయిన్‌ను అధికారులు సీజ్ చేశారు. హెరాయిన్‌ను క్యాప్సూల్స్‌లో నింపి, పొట్టలో దాచి రవాణా చేస్తున్న టాంజానియాకు చెందిన ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. అంతకుముందు మే నెలలో కూడా రూ. 5.56 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను క్యాప్సూల్స్‌లో నింపి, పొట్టలో దాచి రవాణా చేస్తున్న వ్యక్తిని కూడా కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
