Boyfriends Cheats Girlfriend And Prepared To Marry Another Girl In Anantapur: అతడో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ప్రేమిస్తున్నానంటూ ఓ అమ్మాయి వెంటపడ్డాడు. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. దీంతో, అతని ప్రేమను ఆ అమ్మాయిని అంగీకరించింది. కొంతకాలం ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. కట్ చేస్తే.. ప్రియురాలికి తెలియకుండా ఆ ప్రబుద్ధుడు మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ విషయం ఎలాగోలా ఆ అమ్మాయికి తెలిసింది. అయితే.. ఆ యువతి ఆవేశపడకుండా తెలివిగా వ్యవహరించింది. తనని మోసం చేసిన ప్రియుడి ఆట కట్టించేందుకే.. ఎవరితో అయితే అతడు పెళ్లికి సిద్ధమయ్యాడో, ఆ వధువు బంధవులకు అతడి బాగోతం చెప్పింది. ఆ దెబ్బకు పెళ్లి రద్దు అయ్యింది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఇసురాళ్లపల్లికి చెందిన రమేష్ అనే యువకుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఒక యువతి, ఇసురాళ్లపల్లిలో ఉన్న తన బంధువుల ఇంటికి వచ్చి వెళ్తుండేది. ఈ క్రమంలోనే రమేష్‌కి, ఆ యువతికి పరిచయం ఏర్పడింది. అనంతరం అతడు ప్రేమిస్తున్నానంటూ ఆ అమ్మాయి వెంటపడ్డాడు. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మబలికాడు. రమేష్ మాటలు నమ్మిన ఆ అమ్మాయి.. అతని ప్రేమను అంగీకరించింది. అప్పట్నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అయితే.. రమేష్ తనని మోసం చేస్తున్నాడన్న విషయాన్ని గమనించలేకపోయింది. తనని నిజాయితీగానే ప్రేమిస్తున్నాడని, తనే సర్వస్వమని పూర్తిగా నమ్మేసింది. కానీ.. రమేష్ ఈమెతో ప్రేమ వ్యవహారం నడుపుతూనే, మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడు.
అనంతపురం జిల్లాలోని పెద్దవడుగూరు మండలం వీరేపల్లికి చెందిన ఓ యువతితో రమేష్ వివాహం నిశ్చయమైంది. బుధవారం ఇసురాళ్లపల్లిలోని ఆనందాశ్రమంలో వీరి వివాహం జరుగుతున్న విషయం బాధితురాలికి తెలిసింది. దీంతో.. ఆ అమ్మాయి వెంటనే వధువు బంధువులకు రమేష్ బాగోతం చెప్పేసింది. తనని ప్రేమించి మోసం చేశాడని వారి ముందు ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో.. ఆ అమ్మాయితో కలిసి వధువు బంధువులు సైతం గుత్తి పోలీస్ స్టేషన్‌లో రమేష్‌పై ఫిర్యాదు చేశారు. స్టేషన్‌కు పిలిపించి రమేష్‌ను విచారించగా.. గుట్టు మొత్తం రట్టయ్యింది. ఈ కేసులో రమేష్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
