Bihar Robbery: బీహార్‌లోని బెతియాలో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. బుధవారం మధ్యామ్నం కాళీబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుప్రియా సినిమా రోడ్డులో ఉన్న సెంకో గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూంపై ఆయుధాలతో కొందరు దుండగులు దాడి చేశారు. సుమారు 6 నుంచి 8 మంది నేరస్తులు తుపాకులు, ఇతర ఆయుధాలతో షోరూంలోకి ప్రవేశించి సిబ్బందిని బెదిరించి బందీలుగా చేసుకున్నారు. ఆ తర్వాత బంగారం, వెండి ఆభరణాలు, నగదును దోచుకుని పారిపోయారు. దుండగుల చేతితో తుపాకులు, ఇతర ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. షోరూంలోని ఉద్యోగుల్ని ఆయుధాలతో బెదిరించి, సంచుల్లో ఆభరణాలను వేసుకుని వెళ్లిపోయారు.
దుండగులు దోచుకెళ్లిన ఆభరణాల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ దోపిడీని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక ఉద్యోగిపై దాడి చేశారు. తుపాకీతో దాడి చేసి గాయపరిచారు. రద్దీగా ఉండే రోడ్డులో పట్టపగలే ఈ దోపిడి జరగడం సంచలనంగా మారింది. ఘటనా స్థలనానికి చంపారన్ రేంజ్ డీఐజీ హర్ కిషోర్ రాయ్, ఎస్ఎస్పీ కుమార్ గౌతమ్ భారీ పోలీసు బలగాలతో చేరుకున్నారు. షోరూమ్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగా నిందితులను గుర్తించడంతో పాటు వారి కదలికలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

