A Nurse Assaulted At Health Centre In Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆరోగ్య కేంద్రంలోనే ఒక నర్సు సామూహిక అత్యాచారానికి గురైంది. ఒంటరిగా ఉన్న ఆ నర్సుని చూసి, కొందరు దుండగులు కేంద్రంలోకి దూరి, ఆమె నోరు బిగించి అత్యాచారానికి పాల్పడ్డారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మహేంద్రగఢ్ జిల్లాలోని చిప్చిపి గ్రామంలో ఒక ఆరోగ్య కేంద్రంలో ఓ నర్సు ఒంటరిగా పని చేసుకుంటోంది. సరిగ్గా మూడు గంటల సమయంలో కొందరు దుండగులు ఆరోగ్య కేంద్రంలోకి దూరి.. వెంటనే నర్సు నోరు బిగించి, చేతులు కట్టేశారు. ఆమెపై ఒకరి తర్వాత మరొకరు సామూహిక అత్యాచారం చేశారు. అంతేకాదు.. లైంగిక దాడిని సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే.. చంపేస్తామని బెదిరించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆరోగ్య కేంద్రం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన బాధితురాలు, తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి, నిందితుల కోసం గాలించారు. ముగ్గురు నిందితుల్ని పట్టుకోగా.. ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు. అరెస్టైన నిందితుల్లో ఒక మైనర్ కూడా ఉన్నాడు. కాగా.. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రాజకీయంగా అగ్గీ రాజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మనేంద్రగఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ జైశ్వాల్ స్పందిస్తూ.. బీజేపీ ఈ అత్యాచార ఘటనని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు, ఈ ఘటనతో రిమోట్ గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తలు పనిచేసేందుకు భయాందోళనలు గురవుతున్నారు. తమకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.