A 12 Year Old Boy Dies During Rehearsing Bhagat Singh Scene: పాఠశాలల్లో నిర్వహించే నాటకాల్లో పాల్గొనేందుకు కొందరు విద్యార్థులు ఎంత ఆసక్తి కనబరుస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తాము పోషించే పాత్రలకు జీవం పోయాలని తెగ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఓ బాలుడు తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చిత్రదుర్గలో నివాసముంటున్న నాగరాజ్ గౌడ, భాగ్యలక్ష్మి అనే దంపతులకు సంజయ్ గౌడ అనే కొడుకు ఉన్నాడు. అతని వయసు 12 సంవత్సరాలు. బదవానెలోని ఓ స్కూల్‌లో ఏడవ తరగతి చదువుతున్నాడు.
కట్ చేస్తే.. ఆదివారం రోజు నాగరాజ్, భాగ్యలక్ష్మీ తన కొడుకుని ఇంట్లోనే వదిలి హోటల్‌కి వెళ్లారు. రాత్రి 9 గంటలకు తిరిగొచ్చారు. అయితే.. ఎన్నిసార్లు తలుపు కొట్టినా సంజయ్ డోర్ తీయలేదు. దీంతో పక్కింటి వాళ్ల సాయంతో తలుపులు బద్దలు కొట్టి, ఇంట్లోకి వెళ్లారు. అప్పుడు ఇంట్లో ఫ్యాన్‌కి ఉరేసుకున్న సంజయ్ వాళ్లకి కనిపించాడు. వెంటనే కిందకి దింపి అతడ్ని పరీక్షించగా.. అప్పటికే ప్రాణం పోయిందని తేలింది. స్కూల్‌లో జరగబోయే వేడుకల్లో భగత్ సింగ్ నాటకంలో పాల్గొనేందుకు.. సంజయ్ కొన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడని నాగరాజ్ చెప్పారు. ఆదివారం ఇంట్లోనే ఉన్న సంజయ్.. ఉరి వేసుకునే సీన్‌ను ప్రాక్టీస్ చేస్తూ, ప్రమాదవశాత్తూ చనిపోయి ఉంటాడని తెలిపారు.
అయితే.. స్కూలు యాజమాన్యం వాదన మాత్రం మరోలా ఉంది. తాము నాటకం వేయాలని గానీ, భగత్ సింగ్ వేషం పోషించాలని గానీ.. విద్యార్థులెవరికీ చెప్పలేదని స్పష్టం చేసింది. దీంతో.. సంజయ్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టారు. సంజయ్‌ది సహజ మరణమేనా? లేక హత్యనా? అనేది దర్యాప్తు చేస్తున్నారు.