Site icon NTV Telugu

Uttarakhand: రిసార్ట్‌లో హత్యకు గురైన రిసెప్షనిస్ట్‌.. మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్

Ankita Bhandari

Ankita Bhandari

Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌ జిల్లాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసే అంకితా భండారీ హత్యకు గురైంది. ఆమెను కొండ పైనుంచి నదిలోకి తోసేశారు. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన 19 ఏళ్ల యువతి అంకితకు న్యాయం చేయాలంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ యువతి సెప్టెంబర్ 18 నుంచి కనిపించకుండా పోయినట్లు తెలిసిన అనంతరం ఆమె చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. రిసార్ట్ యజమాని, మేనేజర్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే నిందితుల్లో ఒకరికి బీజేపీతో సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఆరోపించడంతో పరిణామాలు రాజకీయ మలుపు తిరిగాయి.

పౌరి గర్వాల్‌లోని శ్రీకోట్ గ్రామానికి చెందిన అంకిత భండారి మిస్సింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో రాష్ట్ర మాజీ మంత్రి వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య సహా ముగ్గురిని అరెస్టు చేశారు. త్వరలోనే విచారణ పూర్తవుతుందని పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు బాలిక మృతదేహం లభ్యం కాలేదు. జిల్లా పవర్ హౌస్ సమీపంలోని శక్తి కెనాల్‌లో పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం మృతదేహం కోసం గాలిస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన అనంతరం హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

H-New DCP Chakravarthy: ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతోనే.. డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్

అంకితా భండారి గత ఐదు రోజులుగా రిసార్ట్ నుంచి కనిపించకుండా పోగా.. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అంకిత కోసం రెవెన్యూ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పౌరీ జిల్లా మేజిస్ట్రేట్ ఈ విషయంలో జోక్యం చేసుకుని రెవెన్యూ పోలీసుల నుంచి రెగ్యులర్ పోలీసులకు బదిలీ చేశారు. ఆ తర్వాత పోలీసులు చర్యలు తీసుకుని రిసార్ట్ యజమాని పుల్కిత్‌ ఆర్యతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అంకిత హత్య విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు రిసార్ట్‌ను కూల్చివేయడానికి బుల్‌డోజర్లను ఉపయోగించాలని స్థానికులు కోరుతున్నారు. నివేదికల ప్రకారం, ఈ రిసార్ట్ బీజేపీ నాయకుడికి చెందినది.

రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, “ఇది చాలా బాధాకరమైన సంఘటన. లక్ష్మణ్ జూలా పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ప్రైవేట్ రిసార్ట్ ఉంది. శ్రీకోట్ గ్రామానికి చెందిన ఒక అమ్మాయి దానిలో పని చేస్తుంది. ఆమె 5 రోజులుగా కనిపించకుండా పోయింది. రెవెన్యూ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇది క్రితం రోజు మాత్రమే సాధారణ పోలీసులకు బదిలీ చేయబడింది. 24 గంటల్లో ప్రధాన నిందితుడు పుల్కిత్ ఆర్యతో సహా ముగ్గురు నిందితులను లక్ష్మణ్ జూలా పోలీసులు అరెస్టు చేశారు. విచారణ జరుగుతోంది” అని డీజీపీ తెలిపారు.

Exit mobile version