NTV Telugu Site icon

రివ్యూ : స్టేట్ ఆఫ్ సీజ్ : టెంపుల్ అటాక్ (జీ 5)

State of Siege: Temple Attack Review

2008 నవంబర్‌ 26 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. అందులో ఒకటి ‘స్టేట్‌ ఆఫ్ సీజ్: 26/11’ వెబ్ సీరిస్. ఇది ఆ మధ్య జీ 5లో స్ట్రీమింగ్ అయినప్పుడు చక్కని ఆదరణ లభించింది. దాంతో తాజాగా దానికి కొనసాగింపుగా ‘స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్’ను రూపొందించారు. అయితే ఇది వెబ్ సీరిస్ కాదు. దాదాపు రెండు గంటల నిడివి ఉన్న సినిమా. కాంటిలో పిక్చర్స్ అధినేత అభిమన్యు సింగ్ దీని నిర్మాత. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కెన్ ఘోష్ దర్శకుడు. ఈ మధ్య కాలంలో చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న అక్షయ్ ఖన్నా ఇందులో కీలక పాత్ర పోషించారు.

2002 సెప్టెంబర్ 24న గుజరాత్ లోని అక్షరధామ్ లో జరిగిన దారుణ మారణకాండ అందరికీ తెలిసిందే. ఆ దేవాలయ ప్రాంగణంలోకి ఇద్దరు ముస్లిం తీవ్రవాదులు ప్రవేశించి, విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల కారణంగా 30 మంది చనిపోయారు. దాదాపు 80 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు ఎన్.ఎస్.జి. కమాండోస్ తో పాటు ఇద్దరు గుజరాత్ పోలీసులు ఉన్నారు. ఈ సంఘటన నేపథ్యంలోనే కెన్ ఘోష్ ‘స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్’ మూవీ తీశారు. శుక్రవారం నుండి ఇది జీ 5లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

నిజ సంఘటనల ఆధారంగా దీన్ని రూపొందించినట్టు సినిమా ప్రారంభంలో చెప్పినా, దర్శక రచయితలు తగినంత స్వేచ్ఛ తీసుకుని ఆ సంఘటనలను తిరగ రాశారు. అందువల్ల ఇందులో పాత్రలు, సంఘటనలు ఎవరినీ ఉద్దేశించినవి కావనే ప్రకటన సినిమా ప్రారంభంలోనే చూపారు. అయితే… దీన్ని చూస్తున్నంత సేపు మనకు గుజరాత్ లోని అక్షరధామ్ ఘటన ఆధారంగా తీసిందనేది మనసులో మెదులుతూనే ఉంటుంది.

సినిమా ప్రారంభమే చాలా ఆసక్తికరంగా మొదలైంది. జమ్ము కాశ్మీర్ లోని ఓ మారుమూల ప్రాంతంలో మినిస్టర్ కూతురును ఉగ్రవాదుల చెర నుండి హనుత్ సింగ్ (అక్షయ్‌ ఖన్నా) అనే ఎన్.ఎస్.జి. కమాండో తన బృందంతో కలిసి విడిపిస్తాడు. ఓ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టును ప్రాణాలతో పట్టుకుంటాడు. ఆ ఆపరేషన్ లో పై అధికారి ఆదేశాలను పెడచెవిన పెట్టాడనే కారణంగా హనుత్ సింగ్ ను కొంతకాలం డ్యూటీకి పక్కన పెడతారు. టెర్రరిస్టులను ఎదుర్కొనే క్రమంలో తన సన్నిహితుడిని కోల్పోవడమే కాకుండా హనుత్ సింగ్ సైతం గాయపడతాడు. ఆ గాయాల నుండి కోలుకుని మామూలు మనిషి అవుతున్న సమయంలోనే గుజరాత్ లోని ఓ ప్రముఖ దేవాలయంలోకి నలుగురు తీవ్రవాదులు చొరబడ్డారనే వార్త వస్తుంది. అంతేకాదు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాణాలకు సైతం ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇంతలో దేవాలయంలోకి చొరబడిన తీవ్రవాదాలు విచక్షణా రహితంగా కాల్పులు జరపడం మొదలెడతారు. తమ అధీనంలో ఉన్న భక్తులను, పర్యాటకులను ప్రాణాలతో వదిలిపెట్టాలంటే… ఖైదీగా ఉన్న తమ టెర్రరిస్టు నాయకుడిని విడిచిపెట్టాలని హుకుం జారీ చేస్తారు. ఎన్.ఎస్.జి. కమాండో హనుత్ సింగ్ టీమ్… దేవాలయంలోని తీవ్రవాదులను ఎలా కట్టడి చేసింది? అందులోని భక్తులను ఎలా రక్షించింది? తీవ్రవాదుల డిమాండ్ కు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్టు నాయకుడిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద సంస్థకు అప్పగించిందా? లేదా? అనేది మిగతా సినిమా.

గతంలో ఊహాజనితమైన కథలు, కథనాల ఆధారంగా భారతీయ సైనికుల శౌర్యాన్ని చాటుతూ కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత మాత్రం శత్రుదేశాలతో మనవాళ్ళు చేసిన యుద్ధాల నేపథ్యంలోనూ, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో టెర్రరిస్టులను మన ఆర్మీ ఎలా ఎదుర్కొన్నదనే సంఘటనలతోనూ సినిమాలు వస్తున్నాయి. ఈ క్రమంలో వాస్తవ సంఘటనలకు కాస్తంత నాటకీయత జోడించడమూ జరుగుతోంది. ‘స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్’ కూడా అలాంటిదే. వాస్తవ సంఘటనలను యధాతథంగా కాకుండా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని డైరెక్టర్ కెన్ ఘోష్ ఈ మూవీ తీశారు. గుజరాత్ లోని అక్షరధామ్ పేరును ఇందులో కృష్ణధామ్ గా మార్చారు. అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోదీ పేరును చోక్సీగా మార్చేశారు. ఆ సమయంలో దేవాలయంలోకి ఇద్దరు తీవ్రవాదులు ప్రవేశిస్తే, వారి సంఖ్యను నాలుగు చేశారు. సాయంత్రం మొదలైన అక్షరధామ్ మారణకాండ ఆ మర్నాడు ఉదయం వరకూ సాగింది. రాత్రంతా తీవ్రవాదాలు, ఎన్.ఎస్.జి. కమోండోలు, స్థానిక పోలీసుల మధ్య కాల్పులు, కవ్వింపు చర్యలూ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ సినిమాలో మాత్రం ఇదో మూడు, నాలుగు గంటల పాటు జరిగిన ఆపరేషన్ అన్నట్టుగా తీశారు. తీవ్రవాదులపై మన ఆర్మీ జవానులదే చివరకు పై చేయి అయ్యింది. అయితే… ఆ యా సంఘటనలను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు కెన్ ఘోష్ విఫలం అయ్యారు. దేవుడి దర్శనం చేసుకుందామని వచ్చిన భక్తుల మనోవేదన, వారి సంబంధీకుల ఆవేదన, దేవాలయం బయట ఉన్నవారి మానసిక స్థితి, పర్యాటకుల నిస్సహాయత… వీటిని దర్శకుడు సరైన రీతిలో తెర మీద చూపించలేకపోయాడు. యాక్షన్ సన్నివేశాలు ఫర్వాలేదనిపించినా, మిగిలిన వాటిని డాక్యుమెంటరీలా ప్రెజెంట్ చేశాడు. దాంతో జాతిని కుదిపేసిన ఓ విషాద సంఘటన తాలుకు తీవ్రత ఈ సినిమాలో కనిపించకుండా పోయింది. అలానే ప్రాణాలను పణంగా పెట్టి ఆపరేషన్ లో పాల్గొన్న వ్యక్తుల నేపథ్యాన్ని కూడా ఆకట్టుకునేలా తీయలేదు. ఉదాహరణకు ఒకటి రెండో రోజుల్లో భార్య డెలివరీ పెట్టుకుని ఆపరేషన్ లో పాల్గొనడానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన మేజర్ సమర్ పాత్రపై మరింత ఫోకస్ పెట్టి ఉండాల్సింది. కానీ రచయితలు విలియం బోర్త్విక్, సైమన్ ఫాంటౌజో ఆ పని చేయలేదు.

నటీనటుల విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత ఆర్మీ మ్యాన్ పాత్రలో అక్షయ్ ఖన్నా బాగానే నటించాడు. ఉన్నత అధికారుల మాటలను పెడచెవిన పెట్టే క్రమంలోనూ, తన కంటే జూనియర్స్ తో సూటిపోటి మాటలు పడే క్రమంలోనూ అతను పడిన మానసిక సంఘర్షణ మనకు తెర మీద కనిపిస్తుంది. అక్షయ్ ఖన్నా కు స్క్రీన్ స్పేస్ ఎక్కువే ఉన్నా, అతని పాత్రను పూర్తి స్థాయిలో డైరెక్టర్ ఎలివేట్ చేయలేకపోయారు. ఇక మిగిలిన పాత్రల్లో గౌతమ్ రోడ్, వివేక్ దహియా, ప్రవీణ్ దబాస్, సమీర్ సోని, అక్షయ్ ఒబెరాయ్, అభిలాష్ చౌదరి తదితరులు నటించారు. తెలుగులో పలు చిత్రాలలో ప్రతినాయకుడి పాత్ర పోషించిన అభిమన్యు సింగ్, అలానే ఆరేడు తెలుగు సినిమాల్లో నాయికగా నటించిన మంజరీ ఫడ్నవీస్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. తేజస్ ప్రమోద్ శెట్టి కాశ్మీర్ అందాలను చక్కగా కెమెరాలో బంధించారు. కార్తీక్ షా సంగీతం, అనిల్ కుమార్ కనకొండ్ల సౌండ్ డిజైన్, మిక్సింగ్ యాక్షన్ సన్నివేశాలను కొంతమేరకు ఎలివేట్ చేశాయి.

పేట్రియాటిక్ మూవీస్, ఆర్మీ గొప్పతనాన్ని తెలిపే సినిమాలను సాదాసీదాగా తీసినా, వీక్షకులు చూసేస్తారనే భ్రమ ఎవరూ పెట్టుకోనక్కర్లేదు. ఎంచుకున్న కథ గొప్పదైతే సరిపోదు, దానిని ఆసక్తికరంగా తెరపై చూపడం కూడా ప్రధానమే. లేకపోతే… ఏ మంచి సంఘటనలను వారు జనాలకు చేరవేయాలని ప్రయత్నం చేస్తున్నారో అది విఫలమైపోతుంది. ఓ రకంగా ‘స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్’ విషయంలోనూ అదే జరిగింది.

రేటింగ్ : 2.25 / 5

ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
అక్షయ్ ఖన్నా నటన
నేపథ్య సంగీతం

మైనెస్ పాయింట్స్
పేలవమైన కథనం
మెప్పించని భావోద్వేగ సన్నివేశాలు

ట్యాగ్ లైన్: ఎమోషన్స్ నిల్!

Show comments