NTV Telugu Site icon

రివ్యూ: నవంబర్ స్టోరీ (వెబ్ సీరిస్)

తోటి స్టార్ హీరోయిన్లు వెబ్ సీరిస్ లో నటించే విషయమై మీనమేషాలు లెక్కిస్తుంటే తమన్నా మాత్రం చక చకా ఈ కరోనా పేండమిక్ సమయంలో రెండు వెబ్ సీరిస్ లలో నటించేసింది. ‘లెవన్త్ అవర్’ వెబ్ సీరిస్ ఇటీవల ఆహాలో స్ట్రీమింగ్ కాగా, దాని కంటే ముందే షూటింగ్ జరుపుకున్న ‘నవంబర్ స్టోరీ’ తాజాగా డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంలో రూపుదిద్దుకున్న ఈ వెబ్ సీరిస్ ను తెలుగు, హిందీ భాషల్లో చూసే సౌకర్యం కూడా ఉంది. ఒక రోజు రాత్రి జరిగే కథాంశంతో రూపొందిన ‘లెవంత్ అవర్’లో కార్పొరేట్ టైకూన్ గా నటించిన తమన్నా, ‘నవంబర్ స్టోరీ’లో ఎథికల్ హ్యాకర్ గా, మధ్యతరగతి మహిళ పాత్రను పోషించింది. ఈ మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ వెబ్ సీరిస్ ఎలా ఉందో తెలుసుకుంది.

అనురాధ (తమన్నా) ఓ ప్రొఫెషనల్, ఎథికల్ హ్యాకర్. ఎఫ్.ఐ.ఆర్.ల డిజిటలైజేషన్ టెండర్ వేసిన తన స్నేహితుడు మలర్ వన్నన్ (వివేక్ ప్రసన్న)కు సాయం చేస్తుంటుంది. డిజిటలైజేషన్ జరుగుతున్న సమయంలోనే వారి సాఫ్ట్ వేర్ హ్యాక్ అవుతుంది. ఇదిలా ఉంటే అనురాథ తండ్రి గణేశన్ (జి.వి. కుమార్) పేరొందిన క్రైమ్ స్టోరీ రైటర్. అయితే వయోభారం కారణంగా ఆయన అల్జీమర్ వ్యాధికి గురవుతుంటాడు. చనిపోయేలోగా ఓ నవల రాయాలని కూతురు సాయం కోరతాడు. తండ్రి ఆరోగ్యం కోసం లక్షలు ఖర్చు అవుతాయని తెలిసి, ఆయన పేరుతో ఉన్న ఓ పాత భవంతిని అను అమ్మాలనుకుంటుంది.

ఇలాంటి సమయంలో వారి ఆ పాత భవంతిలో ఓ మహిళ హత్యకు గురవుతుంది, ఆమె పక్కనే తన తండ్రి ఉండటం చూసి అను అవాక్కవుతుంది. తండ్రిని అక్కడి నుండి ఇంటికి తీసుకెళ్ళిపోయి, పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. అను పాత ఇంటిలో హత్యకు గురైంది ఎవరు? ఆ సమయంలో ఆమె తండ్రి అక్కడకు ఎందుకెళ్ళాడు? హతురాలికి ఆయనకు మధ్య ఉన్న సంబంధం ఏమిటీ? అను స్నేహితుడి ఆఫీస్ లో ఎఫ్.ఐ.ఆర్. ఫైల్స్ హ్యాక్ కావడానికి కారకులు ఎవరు? ఈ చిక్కుముడులన్నింటినీ ఏడు ఎపిసోడ్స్ లో దర్శకుడు ఇంద్ర సుబ్రమణియన్ విప్పే ప్రయత్నం చేశాడు.

‘నవంబర్ స్టోరీ’ వెబ్ సీరిస్ కు బలం కథ. బలహీనం కథనం. హ్యాకింగ్ తో మొదలయ్యే ఈ కథ, ఆ తర్వాత అల్జీమర్ తో బాధపడే రచయిత వింత ప్రవర్తనతో ఊపందుకుంటుంది. ఇక మూడు, నాలుగు ఎపిసోడ్స్ లో ఆ రైటర్ కు చెందిన భవంతిలోనే మహిళ హత్యకు గురి కావడం, దానికి సరిగ్గా గంట ముందే ఓ మహిళ… తమన్నాకు ట్రైన్ లో ఎదురు కావడం ఇవన్నీ ఆసక్తికరంగా ఉంటాయి. చూసే వీక్షకుడిలో ఉత్సుకతనూ కలిగిస్తాయి. అయితే… ఒక్కసారి పోస్ట్ మార్టమ్ డాక్టర్ యేసు (పశుపతి) సీన్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు చూచాయగా ఏం జరుగుతోందో అర్థమైపోతుంది. కానీ దానికి మోటివ్ ఏమిటనేదే దర్శకుడు చివరి వరకూ రివీల్ చేయకుండా దాచి పెట్టాడు.

మనుషులు ఎంత పెద్ద చదువులు చదివినా, వారిలో సైకో ప్రవృత్తి ఉండటం మనం ఆ మధ్య వచ్చిన చాలా తమిళ సినిమాలలో చూశాం. ‘రాక్షసన్, పెంగ్విన్’ వంటివి ఈ కోవకు చెందినవే. ఇందులోనూ ఒకటి రెండు ఎపిసోడ్స్ అదే తరహాలో సాగాయి. ఇక మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడం కోసం పోలీస్ స్టేషన్ లోని అందరినీ ఒకే చోట సమీకరించడం అనేది సమయాన్ని హరించేదిగానే మిగిలిపోయింది. నిడివిని పెంచడం కోసం ఇలాంటి పెట్టారా అనే అనుమానం వస్తుంది. పోనీ నాలుగున్నర గంటల పాటు సాగే ఈ వెబ్ సీరిస్ లో చిక్కుముడులన్నీ వరుసగా దర్శకుడు విప్పుకుంటూ వెళ్ళారా అంటే అదీ లేదు. చాలా వరకూ వీక్షకుల ఊహకే వాటిని వదిలేశాడు.

నటీనటుల నటన విషయానికి వస్తే…. తమన్నా మధ్య తరగతి మహిళగా చక్కగా నటించింది. ‘లెవన్త్ అవర్’లో ఉమెన్ ఎంటర్ పెన్యూర్ గా ఎంత హుందాగా కనిపించిందో, ఇందులో ఓ సాదాసీదా అమ్మాయిగా అంతే సహజంగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. కొన్ని చోట్ల తెగువను ప్రదర్శించిన ఆ పాత్ర, మరి కొన్ని చోట్ల బేలగా మారడంతో నటనకు స్కోప్ ఏర్పడింది. తమన్నా తండ్రిగా, క్రైమ్ స్టోరీ రైటర్ గా జి.ఎం. కుమార్ బాగా చేశారు. ఇక పశుపతి నటన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏ పాత్రను పోషించినా అందులో లీనమైపోవడం అతనికి మొదటి నుండీ అలవాటే. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సుడలై గా అరుణ్ దాస్ నటించాడు. అతని చుట్టు ఉన్న వ్యక్తులు ‘రైటర్ గణేశన్ ను నిందితుడు’ అని చెబుతున్నా, మోటివ్ తెలుసుకోకుండా తొందరపడి అరెస్ట్ చేయననే సుడలై పాత్ర ఈ వెబ్ సీరిస్ కు హైలైట్ గా నిలిచింది.

తమన్నా స్నేహితుడిగా వివేక్ ప్రసన్న, ఇతర పాత్రల్లో మైనా నందిని, నమితా కృష్ణమూర్తి, పూజిత దేవరాజ్, జానీ తదితరులు నటించారు. విదు అయ్యన్న కెమెరాపనితనం బాగానే ఉన్న నైట్ ఎఫెక్ట్ సీన్స్ మాత్రం గందరగోళంగా ఉన్నాయి. అలానే శ్రవణ్ గోవింద స్వామి ఎడిటింగ్ కూడా మరింత పదునుగా ఉంటే బాగుండేది. ముఖ్యంగా కెవిన్ ఫెడ్రిక్ సౌండ్ డిజైన్…. సీన్స్ ను ఎలివేట్ చేసేలా ఉంది. అయితే దర్శకుడు ఇంద్ర సుబ్రమణియన్ క్లయిమాక్స్ ను తేల్చేశాడు. అప్పటి వరకూ గ్రిప్పింగ్ గా సాగిన వెబ్ సీరిస్ ను చివరి రెండు ఎపిసోడ్స్ లో సాగదీశారు. నిజానికి టైమ్ లిమిటేషన్ అనేది పెద్దగా ఉండదు కాబట్టి, ప్రతి పాత్రకు అర్థవంతమైన ముగింపును ఇచ్చి ఉండాల్సింది. అలా జరగలేదు. ప్రతి ఎపిసోడ్ ప్రారంభంలో కొద్ది నిమిషాల సేపు ప్లాష్ బ్యాక్ కు సంబంధించిన సన్నివేశాలను చూపించారు. అయితే వాటిని డైలాగ్స్ లేకుండా పెట్టడంతో ఏం జరుగుతోందో ఊహించాల్సిన పరిస్థితి వీక్షకులకు కలిగింది. దాంతో మరింత కన్ ఫ్యూజన్ క్రియేట్ అయింది.

హారర్, థ్రిల్లర్ వెబ్ సీరిస్ ను ఇష్టపడే వారికి, తమన్నా అభిమానులకు ‘నవంబర్ స్టోరీ’ నచ్చుతుంది. మిగిలిన వారు టైమ్ పాస్ కోసం చూడొచ్చు. ఏదేమైనా… ఆనంద వికటన్ లాంటి సంస్థ నుండి వెబ్ సీరిస్ వస్తోందంటే వీక్షకులకు కాస్తంత భారీ అంచనాలే ఉంటాయి. కానీ వాటిని అందుకోవడంలో ‘నవంబర్ స్టోరీ’ ఫెయిల్ అయ్యింది.

రేటింగ్: 2.25 / 5

ప్లస్ పాయింట్స్
తమన్నా, ఇతరుల నటన
ఆకట్టుకునే సౌండ్ డిజైన్
ఎంపిక చేసుకున్న కథ

మైనెస్ పాయింట్
స్లో నెరేషన్
మిస్ అయిన లాజిక్
వీక్షకుల ఊహకే అన్నీ వదిలేయడం
అవసరానికి మించిన పాత్రలుండటం

ట్యాగ్ లైన్: థ్రిల్లర్ ప్రియులకు మాత్రమే!